Alluri sitarama raju jayanthi Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. విజయవాడ, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, కోనసీమ జిల్లాల్లో ఉత్సవాలను నిర్వహించారు. అల్లూరి తన జీవితాంతం పోరాటంలోనే ఉన్నారని.. చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని గడగడలాడించిన యోధుడు అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో అల్లూరిని స్మరించుకోవడం ఎంతో గర్వకారణమని నారా లోకేశ్ అన్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అల్లూరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి, ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. నేటి యువత అల్లూరి ఉద్యమ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూర్యకుమారి అన్నారు.