అనుమతులు తీసుకోకుండా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యం కొవిడ్ చికిత్సలు నిర్వహించడాన్ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా కరోనాకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.
దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే అనుమతి..
ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ చికిత్స నిర్వహణ కోసం దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే ప్రభుత్వం అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ నిల్వలు, మందుల వంటి అత్యవసరాల కొనుగోలుకు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమించిన సర్కార్ తగిన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రోజూ వారీగా విడుదల చేసే కరోనా బులిటిన్‌లో మృతుల సంఖ్య సహా ఇతర వివరాలన్నింటినీ వాస్తవంగానే ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మృతుల వివరాలను ప్రభుత్వం దాచి ఉంచడం లేదని స్పష్టం చేశారు.
'సామర్థ్యం మేరకే చేర్చుకోవాలి'
పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ కోటాను సైతం పెంచాలని కేంద్ర కమిటీని కోరతామన్నారు. కార్పొరేట్ సహా ప్రైవేట్ యాజమన్యాలు తమ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వల కెపాసిటీ మేరకే రోగులను చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్స్, సాధారణ పడకల లభ్యత తగ్గుతూ వస్తోందని వివరించారు.