ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపుదల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలపై భారాలు మోపము అని చెప్పి అధికారంలోకి వచ్చాక పన్నుల పెంపు నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు.
'పన్ను పెంపు నోటిఫికేషన్ రద్దు చేయండి' - విజయవాడలో అఖిల పక్ష సంఘాల సమావేశం
కౌన్సిల్ ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్ ఏర్పడ్డాక, స్పెషల్ ఆఫీసర్లతో ఆస్తి విలువ ఆధారిత పన్నుల నోటిఫికేషన్ జారీ చేయడం మున్సిపల్ యాక్ట్‌కు విరుద్ధమని అఖిలపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. తక్షణమే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపుదల నోటిఫికేషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజలను మోసం చేసి వైకాపా అధికారంలోకి వచ్చిందన్న వారు.. ఎల్లప్పుడూ ప్రజలను మోసం చేయడం కుదరదన్నారు. పన్నులపెంపు జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 11, 12 తేదీల్లో సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తుమన్నారు. కౌన్సిల్ ఉండగా స్పెషల్ ఆఫీసర్లతో పన్ను పెంపు నోటిఫికేషన్ జారీ చేయడం మున్సిపల్ యాక్ట్‌కు విరుద్ధమని తెదేపా కార్పొరేటర్ బాలస్వామి అన్నారు. పన్ను పెంపు జీవోలు వెనక్కి తీసుకునేవరకు అన్ని పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామన్నారు.