విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై బహిరంగ సభ నిర్వహించారు. సభలో వైకాపా, తెదేపా, కమ్యూనిస్టు, జనసేన నేతలు పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమానికి మద్దతుగా వేల సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. సీపీఐ రామకృష్ణ చెప్పారు. అధికార, ప్రతిపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చారని.. కలిసి పోరాటం చేసినా కేంద్రం వెనక్కి తగ్గడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఉక్కు పరిశ్రమ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం జగన్‌ను కోరుతున్నామన్నారు. లేఖ రాసి ఊరుకుంటే కేంద్రం ఏమీ స్పందించదన్న రామకృష్ణ.. విశాఖ ఉక్కు కోసం అందరం కలిసి దిల్లీ వెళ్దామన్నారు. దిల్లీని గడగడలాడించి విశాఖ ఉక్కును కాపాడుకుందామని చెప్పారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగనివ్వం. విభజన హామీల గురించి కేంద్రాన్ని నిలదీయాలి. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా ఏమయ్యాయి?. పరిశ్రమ రక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలి.