కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న చేపట్టిన భారత్ బంద్‌ను (Bharat bandh) విజయవంతం చేయాలని తెలంగాణ అఖిలపక్ష పార్టీలు(all party meeting) పిలుపునిచ్చారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు భారత్ బంద్‌కు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఎంబీ భవన్‌లో సమావేశమైన అఖిలపక్ష పార్టీల నేతలు భారత్ బంద్ అంశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. దేశంలో మతోన్మాద దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెగసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతల రహస్యాలు తెలుసుకుంటోందని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్, గ్యాస్‌పై పన్నులు తగ్గించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడంతో పాటు పోడు రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయన్నారు.
అఖిలపక్ష పార్టీలు చేపట్టిన భారత్ బంద్‌లో తెదేపా సంపూర్ణంగా పాల్గొంటుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని.. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు.
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు సహాయం అందించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న చేపట్టిన భారత్ బంద్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోజు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాల్సిందే. కరోనాను అరికట్టడంలో కేంద్రం విఫలమైంది. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అణచివేత చర్యలు, దేశద్రోహ చట్టం, ఉపా చట్టం తెచ్చి ప్రతిపక్షాలను బంధించడం జరుగుతోంది. స్పైవేర్ తీసుకొచ్చి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు.- తమ్మినేని వీరభద్రం, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి