పార్టీ గుర్తులతో జరిగే పురపాలక ఎన్నికలను అన్ని రాజకీయపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నాయి. కీలక నేతలు రంగంలోకి దిగి.. అభ్యర్థుల తరఫున రోడ్‌షోలు, ఇంటింటికి ప్రచారం నిర్వహించడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కృష్ణా జిల్లా నందిగామలో తెలుగుదేశం నేత నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో చూపిన తెగువ.. పురపాలికల్లోనూ చూపాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పురపాలనకు పంచసూత్రాల పేరిట ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేయనున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. 17వ డివిజన్ ప్రచారంలో ఇరుపార్టీలు ఎదురుపడి నినాదాలు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని నాని పంతం నెగ్గించుకున్నారు. ఆయన సూచించిన అభ్యర్థికే టిక్కెట్ ఖరారు చేయడంతో.. కేశినేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 32వ డివిజన్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. 27వ డివిజన్‌లో బొండా ఉమ ప్రచారంలో పాల్గొన్నారు.