kalyanam at antarvedi: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పంచముఖ ఆంజనేయుడి వాహనంపై, రాత్రికి కంచి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తుల్ని కళ్యాణ మండపంలో ప్రతిష్ఠ చేస్తారు. రాత్రి 12 గంటల 35 నిమిషాలకు మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి దేవస్థాన కమిటీ ఏర్పాట్లు చేసింది.
భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా125 బస్సులను నడుపుతోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే భక్తుల్ని మల్కిపురం చేరుస్తారు. అక్కడినుంచి అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవానికి 1450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవానికి తరలిరానున్నారు. కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ధ్వజారోహణ, వాస్తుపూజ అంకురార్పణ, వాహన సేవలు వైభవంగా జరిగాయి.