ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గేరు మార్చిన గన్నవరం ఎయిర్ కార్గో - gannavaram aircargo news

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గో పుంజుకుంటోంది. నెలకు వంద టన్నులకు పైగా సరుకు రవాణా అవుతోంది. కోల్‌కతా, సూరత్‌కు రొయ్య పిల్లల ఎగుమతి అవుతుండగా... ఈ కామర్స్, బంగారం ఉత్పత్తులు అధికంగా దిగుమతి అవుతున్నాయి.

AirCargo
AirCargo

By

Published : Nov 1, 2020, 5:34 PM IST

గన్నవరం విమానాశ్రయం నుంచి సరకు రవాణా పుంజుకుంటోంది. ఎయిర్‌కార్గోలో ఇక్కడి నుంచి రొయ్య పిల్లలు, పోస్టల్‌ ఉత్తత్తులు అత్యధికంగా ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి. అటునుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బంగారం, వెండి, ఈకామర్స్‌ ఉత్పత్తుల దిగుమతి అధికంగా ఉంది. ఈ ఏడాది మార్చికి ముందు నెలకు 300 టన్నుల వరకు సరకు ఉత్పత్తి అయ్యేది. కరోనా నేపథ్యంలో ఆరేడు నెలలుగా ఎయిర్‌కార్గో పూర్తిగా స్తంభించిపోయింది. విమాన సర్వీసులు ఆరంభించినా.. నెలకు కనీసం ఐదు నుంచి పది టన్నులు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. తాజాగా సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఉత్పత్తి వంద టన్నులు దాటింది. వీటిలో బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న సరకు అధికంగా ఉంది.

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ నగరాలకు సరకు ఎగుమతి.. దిగుమతి జరుగుతోంది. సెప్టెంబర్‌ నుంచి రొయ్య పిల్లల ఉత్పత్తి ఇటునుంచి పెద్దఎత్తున ఆరంభమైంది. ప్రధానంగా సూరత్, కోల్‌కతా ప్రాంతాలకు ఇక్కడి నుంచి రొయ్య పిల్లలను అధిక సంఖ్యలో పంపిస్తున్నారు. వీటితోపాడు పోస్టల్‌ విభాగానికి చెందిన బ్యాగులు రోజుకు కనీసం 300 కిలోల వరకు రాకపోకలు జరుగుతున్నాయి. వీటి తర్వాత ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ అధికంగా వస్తున్నాయి. వీటిలో సెల్‌ఫోన్‌ సంస్థలకు చెందిన ఉత్పత్తులు ఎక్కువ ఉంటున్నాయి. బంగారు దుకాణాలకు చెందిన ఆభరణాలు దిల్లీ, బెంగళూరు నగరాల నుంచి ప్రస్తుతం అధికంగా ఇక్కడికి ఎయిర్‌కార్గోలో వస్తున్నాయి.

  • ఈ- కామర్స్ కొనుగోళ్లు పెరగటంతో...

అక్టోబర్‌ నెలలో ఈకామర్స్‌ సంస్థలకు చెందిన సరకు ఎక్కువగా ఎయిర్‌కార్గోలో వస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా పలు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు ఉత్పత్తులపై దసరా పండగ రాయితీలను ప్రకటించటంతో.. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు భారీగా కొనుగోళ్లు చేశారు. వీటిలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, దుస్తులు, పిల్లల ఆటవస్తువులు, పాదరక్షలు లాంటివి అధికంగా ఉన్నాయి.

  • ప్రత్యేక విమానాల ఏర్పాటు..

విమానాశ్రయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12గంటల వరకూ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. గతంలో రోజుకు 50వరకు విమాన సర్వీసులు ఇక్కడి నుంచి దేశంలోని తొమ్మిది నగరాలకు వెళ్లేవి. ప్రస్తుతం పరిమితంగానే సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో కార్గో సేవలు అందుబాటులో ఉన్నవి.. పది విమాన సర్వీసుల వరకు ఉన్నాయి. ఉదయం ఐదు, సాయంత్రం ఐదు సర్వీసులు వెళుతున్నాయి. అవసరాన్ని బట్టి అత్యవసరంగా పంపించాల్సిన మత్స్య ఉత్పత్తుల కోసం స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలతో మాట్లాడి ప్రత్యేక కార్గో విమానాలను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్‌ నెలలో ఒక్కోసారి రోజుకు పది టన్నులకు పైగా రొయ్య పిల్లలను ప్రత్యేక విమానాల్లో కోల్‌కతాకు పంపించారు. ప్రస్తుతం వ్యాపారాలన్నీ కోలుకుంటుండటంతో సరకు రవాణా మరింత పుంజుకునే అవకాశం ఉందని గన్నవరం విమానాశ్రయంలోని కార్గో సేవల మేనేజర్‌ అనీష్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details