AC trains: వేసవిలో రైలు ప్రయాణికులు ఏసీ బోగీలకు ప్రాధాన్యమిస్తుంటారు. ఏసీలు సక్రమంగా పనిచేయకపోవడంతో చల్లగా సాగాల్సిన ప్రయాణం అవస్థల పాలవుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, నిర్వహణ లోపాలతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాత బ్యాటరీలను నిర్ణీత కాల వ్యవధిలో మార్చకపోవడంతో తరచుగా ఏసీలు పనిచేయడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు.
గణాంకాలను పరిశీలిస్తే గత ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్తు విభాగానికి సంబంధించి 44,320 ఫిర్యాదులు అందాయి. అందులో ఏసీలు పనిచేయడం లేదని 25,990 మంది ఫిర్యాదు చేయడం గమనార్హం. మొత్తం రెండు నెలల్లో వచ్చిన ఫిర్యాదుల్లో 58.64 శాతం ఏసీలు పనిచేయడం లేదనే వచ్చాయి. అన్ని జోనల్ కార్యాలయాల అధికారులు దీనిపై దృష్టి సారించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే బోర్డు సంచాలకులు(విద్యుత్తు) తేజ ప్రతాప నారాయణ తాజాగా లేఖ రాశారు.