- తాము తెచ్చిన బిల్లుల వల్ల రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని, దీనివల్ల మెరుగైన ధర లభిస్తుందని కేంద్రం చెబుతోంది. మార్కెట్ యార్డులకు పోటీగా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారాల ఏర్పాటుకూ అనుమతి ఇస్తోంది. ఈ మార్పుల ప్రభావం రైతులపై ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
వ్యవసాయ రంగంలో సంస్కరణల ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారాలు సన్నకారు, చిన్నకారు రైతులకు ఉపయోగపడవు. భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు ఉండవని రైతులు భయపడుతున్నారు. యార్డుల ద్వారా వచ్చే ఆదాయం ఇక రాదనే ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాలలో ఉంది. మండీల ద్వారా పంజాబ్‌కు ఏటా రూ.4వేల కోట్ల ఆదాయం వస్తోంది. సన్నకారు, చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని మనం చట్టాలను తీసుకురావాలి.
- కాంట్రాక్టు వ్యవసాయానికి వస్తే.. దేశంలో రిటైల్ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. బడా కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతోంది. వాటితో బేరమాడి.. ప్రయోజనాలను కాపాడుకోవడం చిన్న రైతులకు సాధ్యమేనా?
ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్న కాంట్రాక్టు వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రభుత్వం చూస్తోంది. దీనివల్ల బడా కంపెనీల ప్రాబల్యం పెరగవచ్చు. కంపెనీకి, రైతుకు వివాదం వస్తే పరిష్కరించే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. అధికారుల వద్ద తమకు న్యాయం జరగదన్న ఆందోళన రైతుల్లో ఉంది. అందువల్ల కాంట్రాక్టు వ్యవసాయంపై నియంత్రణ బలంగా ఉండాలి.
- నిత్యావసర సరకుల చట్టంలో మార్పులవల్ల ఇక వ్యాపారులు ఎంతైనా సరకులు నిల్వ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం వినియోగదారులపై ఎలా ఉండొచ్చు?
తగిన నిల్వలు లేకపోతే ధరలను అదుపులో ఉంచడం కష్టమనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు తెస్తున్న మార్పులతో బడా కంపెనీలకు ఎక్కువ లాభం ఉండవచ్చు. ధరల పెరుగుదల ఫలితం రైతుకు ఎక్కువగా దక్కకపోవచ్చు. ఈ చట్టం వచ్చాక వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు పెరిగితే రైతుకు నష్టమే. ఇలాంటి చట్టాలు తెచ్చేటప్పుడు రైతులనూ సంప్రదించి వారికి మేలు జరిగేలా చూడాలి. సరకులను ఎక్కువగా నిల్వచేస్తే వినియోగదారునికీ నష్టమే. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మన దగ్గర చట్టాలు చేసేటప్పడు రైతుల కంటే వినియోగదారుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇద్దరి ప్రయోజనాలూ చూడాలి.
- దేశవ్యాప్తంగా ఒకే నిబంధనలతో వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు చేయాలనడం హేతుబద్ధమేనా?
నా ఉద్దేశంలో ఒకే దేశం - ఒకే మార్కెట్ అక్కర్లేదు. మన రాష్ట్రాలు భిన్నమైనవి. వేర్వేరు పంటలు, వినియోగ రీతులు ఉన్నాయి. అందువల్ల దేశమంతా ఒకే చట్టం అంత విజయవంతం కాకపోవచ్చు. ఉదాహరణకు పంజాబ్, హరియాణాలలో మండీలు (రాష్ట్ర మార్కెట్ యార్డులు) ఎక్కువ. ఇతర రాష్ట్రాల్లో తక్కువ. అందువల్ల ఒకే చట్టం మంచిది కాదు. రైతులకు స్వేచ్ఛ, సంస్కరణలు అనే భావనలు మంచివే. ఆచరణ లోపాలు లేకుండా చూసుకుంటే వారికి మేలు జరుగుతుంది.
- ఉల్లిపాయల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నప్పుడే కేంద్రం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. ఇది రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. బిహార్, మధ్యప్రదేశ్ ఎన్నికల కోసమే ఈ చర్య తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
ఉల్లిపాయలు బాగా ఉత్పత్తయ్యే నాసిక్ వంటి ప్రాంతాల్లో ఇటీవల వరదల వల్ల పంట దెబ్బతింది. దీంతో ఉల్లిపాయల ధరలు పెరిగాయని ఎగుమతులు ఆపేశారు. ఉల్లి ధరలపై ప్రభుత్వాలు సున్నితంగా స్పందిస్తాయి. ఆ ధరల వల్లే గతంలో కొన్ని ప్రభుత్వాలు పడిపోయాయి. ఉల్లి ఎగుమతుల నిషేధానికి ఎన్నికలూ ఒక కారణం కావచ్చు. అందుకే వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలందరం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు వద్దని చెబుతున్నాం. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. ఎన్నికల కోసం పంటల ఎగుమతులు ఆపేయడం మంచిది కాదు.
- కొత్త బిల్లులతో వ్యవసాయ రంగంలోని కీలకాంశాలపై కేంద్రానిదే పెత్తనం ఉంటుంది. ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వగలవా?