హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఏపీపీఎస్సీ సభ్యుడు నూతలపాటి సోనీవుడ్పై చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. "సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువైన సోనీవుడ్.. క్రైస్తవసంస్థ ముసుగులో మహిళల్ని విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో.. హిందూమతం, హిందూదేవుళ్లపై సోనీవుడ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
హిందూమతాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లను.. సీఎం ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారని సత్యనారాయణమూర్తి విమర్శించారు. సోనీవుడ్ను తక్షణమే ఏపీపీఎస్సీ సభ్యుడి పదవి నుంచి తొలగించి.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూధార్మిక సంస్థలతో కలిసి.. అతని సంస్థను మూయిస్తామని.. కేంద్ర హోంశాఖకూ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
అసలు ఏం జరిగిందంటే..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడు నూతలపాటి సోనీవుడ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం జగన్నాథగిరి పరిధిలో నడుస్తున్న నజరెత్ ఎడ్యుకేషనల్ సొసైటీ (చైల్డ్ హోం) కార్యకలాపాలపై అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. దిల్లీలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ ఫిర్యాదు చేసింది. బాలల పరిరక్షణ చట్టం నిబంధనలు పాటించడం లేదని, అనాథ పిల్లల వివరాలు, చిత్రాలు విదేశీ సంస్థల వెబ్‌సైట్లలో ఉంచి నిధులు సేకరిస్తున్నారని.. ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జగన్నాథగిరి దగ్గర ఉన్న సంస్థ ప్రాంగణాన్ని విచారణ కమిటీ సభ్యులు.. జిల్లా ప్రొబేషన్ అధికారి శ్రీవల్లి, పెద్దాపురం ఆర్డీవో మల్లిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అభివృద్ధి అధికారి ప్రసాద్ తదితరుల బృందం గురువారం పరిశీలించింది. తనిఖీ సమయంలో చైల్డ్ హోంలో ఉన్న నలుగురు పిల్లలతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. సంస్థ నిర్వాహకుల నుంచి ఆరోపణలపై వివరణ కోరారు. కొన్ని దస్త్రాలను పరిశీలించారు. మరికొన్నింటి వివరాలు అందించాలని సూచించారు. ఫిర్యాదుదారు అందించిన ఆధారాల ఆధారంగా స్కాట్లండ్ వెబ్‌సైట్‌ను అధికారులు పరిశీలించారు.
ఇదీ చదవండి:
'బద్వేలు నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయి..'