Tiruvuru gold case ఈనెల 2వ తేదీన తిరువూరులో గోకుల్ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు మాయమయ్యాయి. పక్కనే ఉన్న టైలర్ దుకాణం షట్టర్ పగలకొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు.. టైలర్ దుకాణానికి, గోకుల్ బంగారు నగల దుకాణానికి కామన్‌గా ఉన్న గోడకు రంధ్రం పెట్టి లోనికి ప్రవేశించారు. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను ఊడ్చేశారు. విజయవాడ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు ఏలూరుకు చెందిన కోసూరి రమేష్ (37)గా గుర్తించారు.
నేరం ఎలా చేస్తాడంటే... : ఏలూరు ఏడుకాలువల సెంటరుకు చెందిన కోసూరి రమేష్ పాత నేరస్థుడు. నేరం చేయాలనుకునే దుకాణాన్ని ముందుగా గమనిస్తాడు. రాత్రి వేళ రెక్కీ చేస్తాడు. అర్ధరాత్రి సమయంలో వెళ్లి, దుకాణం గోడకు మనిషి పట్టేంత మాత్రమే రంధ్రం చేస్తాడు. శబ్దం రాకుండా గోనె సంచులు అడ్డు పెడతాడు. లోపలోకి వెళ్లాక సీసీ కెమెరాలు తొలగిస్తాడు. చరవాణి లైట్ల వెలుతురులో సొత్తును ఊడ్చేస్తాడు. ఇలా.. తిరువూరు గోకుల్ బంగారునగల దుకాణంలో మరో ఇద్దరితో కలిసి చోరీ చేశాడు.
2019లో పటమటలో ఇదే తరహా నేరం...:విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో 2019లో ఒక నేరం జరిగింది. ఈ కేసులో రమేష్‌తో పాటు అతడి బావమరిది పట్నాల కిషోర్‌బాబు, మరో ఇద్దరిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. తిరువూరులోని నేరస్థల పరిశీలనకు వెళ్లిన సీసీఎస్ పోలీసులు.. గోడకు రంధ్రాన్ని గమనించి, క్షణాల వ్యవధిలోనే నిందితుడిని గుర్తించారు. రమేష్ కదలికలపై నిఘా ఉంచారు. రమేష్‌తో పాటు అతడికి జైలులో పరిచయం అయిన రాజమండ్రి కొర్లంపేటకు చెందిన గొర్రెల చిన్నబాబు (26), కోనసీమ జిల్లా వెదిరేశ్వరం గ్రామానికి చెందిన బాలుడితో కలిసి తిరువూరులో చోరీకి పాల్పడ్డాడని గుర్తించారు.
జైలులో పరిచయంతో...:గతంలో రమేష్‌పై 8 కేసులు ఉండగా.. గొర్రెల చిన్నబాబుపై 15 కేసులు ఉన్నాయి. రమేష్ గోడకు రంధ్రం చేయటంలో సిద్ధహస్తుడు కాగా.. చిన్నబాబుకు షట్టర్ తాళాలు విరవటంలో ప్రావీణ్యం ఉంది. వీరిద్దరికీ జైలులో పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కలిసి తిరిగారు. విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్రవాహనం చోరీ చేసి, దానిపై తిరువూరు వచ్చారు. గోకుల్ బంగారు దుకాణంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. చిన్నబాబుకు పరిచయం ఉన్న కోనసీమ జిల్లా వెదిరేశ్వరం గ్రామానికి చెందిన బాలుడిని రప్పించారు. ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి ముగ్గురు కలిసి టైలర్ దుకాణం షట్టర్ పగలకొట్టి లోనికి ప్రవేశించారు. పవర్ డ్రిల్లింగ్ యంత్రంతో టైలర్ దుకాణం, బంగారు దుకాణం కామన్ గోడకు రంధ్రం చేశారు. దీని ద్వారా లోపలికి వెళ్లి, సీసీ కెమెరాలకు సంచులు అడ్డు పెట్టారు. షోకేసుల్లో బంగారు, వెండి వస్తువులు, నగదు దొంగిలించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా..
రూరల్ డీసీపీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో క్రైం ఏడీసీపీ పి.వెంకటరత్నం, సీసీఎస్ ఏసీసీ సిహెచ్.శ్రీనివాసరావు, తిరువూరు ఏసీపీ కె.వి.వి.ఎన్.ప్రసాద్‌లు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీఎస్ సీఐ ఎం.రామ్‌కుమార్, తిరువూరు సీఐ ఆర్.భీమరాజులు నిఘా పెట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి రమేష్‌గా గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం తిరువూరు బైపాస్‌రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమేష్, చిన్నబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం బట్టబయలైంది. బాలుడిని సైతం అరెస్టు చేసినట్లు రూరల్ డీసీపీ డి.మేరీ ప్రశాంతి తెలిపారు. బుధవారం సాయంత్రం విజయవాడ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆమె వెల్లడించారు. వారి నుంచి రూ.8.9లక్షల విలువైన 52 గ్రాముల బంగారు ఆభరణాలు, 16.5కిలోల వెండి వస్తువులు, రూ.61,240ల నగదు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ కాంతిరాణాటాటా అభినందించారు.
ఇవీ చదవండి: