విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వైకాపా, తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి కలిసి పోరాడదామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. అవసరమైతే జగన్ నేతృత్వంలో ఉద్యమంలో ముందుకు సాగడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. దిల్లీ వెళ్లి ప్రధానిని కలిసేందుకు సీఎం వెంట వెళ్లేందుకు పార్టీ తరఫున సిద్ధమని వెల్లడించారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎంపీలు ఎవరు రాజీనామా చేసినా మా పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో పెట్టబోమని గట్టిగా చెబుతున్నా...’ అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. త్యాగాలతో సాధించుకున్న స్టీలుప్లాంటును రక్షించేందుకు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, సీఎం కూడా దీనిపై మాట్లాడడం లేదన్నారు.
‘పల్లా చేపట్టిన దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. వాంతులు అవుతున్నాయి. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి చూసేందుకు ఒక్క అధికారైనా రాకపోవడం దారుణం. అటువంటి ముఖ్యమంత్రి పాలనలో ఉండాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విశాఖపై దృష్టి సారించాలని ఓ వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే ఏమనుకోవాలి...’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి కర్త, కర్మ, క్రియ జగన్‌మోహన్‌రెడ్డి. ఎవరో రాసిచ్చినా కాగితాలపై సంతకాలు పెట్టి లేఖ కేంద్రానికి పంపారు. అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు...’ అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా, బాధ్యత కలిగిన పార్టీగా తాము పోరాడుతున్నామని, ఇందులో భాగంగా చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం విశాఖకు వస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏవిధంగా ముందుకువెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, నాగజగదీష్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, చినరాజప్ప, తెదేపా నేత శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.