పవిత్ర కృష్ణాతీరాన వెలిసిన ఇంద్రకీలాద్రి విశిష్టమైనది.. శక్తి మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఈ కొండమీద కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి స్వయంగా అవతరించారని స్థలపురాణం చెబుతోంది. అంతటి ప్రాశస్త్యంతో పాటు, రాష్ట్రంలోనే రెండో పెద్దదైన ఈ దేవస్థానంలో అడుగడుగునా అక్రమాలు.. అవినీతి.. ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. ఆలయంలో ఎక్కడా ఒక వ్యవస్థ అంటూ కనిపిస్తున్న దాఖలాల్లేవు. కోట్లు వెచ్చించి పనులు చేశామంటారే గానీ.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది. కొత్త సౌకర్యం ఒక్కటీ కానరాదు. టోల్‌గేట్లు, పారిశుద్ధ్యం, భద్రత.. ఇలా ఏ టెండర్లలోనూ పద్ధతిని పాటిస్తున్నట్లు కనిపించదు. వీటన్నింటికీ తోడు లెక్కలేనన్ని వివాదాలు, భరించలేనన్ని ఘోరాలు. ఇవన్నీ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. నాడు కిరీటం.. ఇటీవల వెండిసింహాల చోరీలు భద్రతా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. తాజాగా అనిశా దాడులు జరిగిన తర్వాత అవినీతి, అక్రమాల వ్యవహారంలో 15 మంది ఉద్యోగులు సస్పెండయ్యారు. ఈవో తీరు కూడా వివాదాస్పదమైంది. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా.. ఇంద్రకీలాద్రి యంత్రాంగం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు లేదు.
ఉన్నతాధికారులకు మస్కా కొట్టి..
తమ వాళ్లకు టెండర్లను ఇప్పించుకునేందుకు ఈవో, ఏఈవోలు ఉన్నతాధికారులకు మస్కా కొడతారు. తాజాగా పారిశుద్ధ్య టెండర్ విషయంలో ఇలాగే జరిగింది. 2019లో పారిశుద్ధ్య టెండర్‌కు ముగ్గురు అర్హత సాధించగా వారిలో ఎల్1, ఎల్2ను కాదని.. మూడో స్థానంలో ఉన్న తమ బినామీ ఎల్3కి అర్హత ఉందంటూ దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదం కోసం ఈవో పంపించారు. దీనిపై వివాదం చెలరేగడంతో కమిషనర్ నిరాకరించి, మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించారు. కానీ.. అప్పటికే 2021 మార్చి వరకు ఎల్3కి వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్టు ఈవో ఒప్పందం చేసుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు మళ్లీ టెండర్లు పిలిచారు. అప్పుడు ఎల్3తో చేసుకున్న ఒప్పందం రద్దు చేయకపోవడంతో సదరు సంస్థ కోర్టుకు వెళ్లింది. అందుకు అవకాశం ఇవ్వడానికే ఒప్పందం రద్దు చేయలేదనేది బహిరంగ రహస్యం. ఈ అవకతవకలు తాజాగా ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూశాయి. సెక్యూరిటీ టెండర్ విషయంలోనూ ఇలాగే చేశారు. విలువైన వెండిసింహాల చోరీకి ప్రధాన బాధ్యత సెక్యూరిటీ సంస్థదే. వాళ్లపై చర్యలు తీసుకుంటామని హడావుడి చేశారు. కానీ తర్వాత టెండర్లు పిలిచి, మళ్లీ పాత సంస్థకే అవకాశం ఇచ్చారు.
ఇవన్నీ వివాదాలే..
అమ్మవారి కిరీటం దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1999లో గర్భగుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారు కిరీటం (1.5కేజీలు) చోరీ చేశారు. దాదాపు రెండేళ్ల దర్యాప్తు తర్వాత ఓ పాత నేరస్థుడు సాహును అరెస్టు చేశారు. కిరీటం రికవరీ చేశారు. కానీ ఆ కిరీటం తాను చేయించినది కాదని దాత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు.
*గర్భగుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరగడం భక్తుల్లో తీవ్ర అలజడి రేపింది. ఐఏఎస్ అధికారిణి సూర్యకుమారి ఈవోగా ఉన్నప్పుడే ఈ పూజలు జరిగాయి. దీనిపై నాటి సీపీ నివేదిక అందించారు. అర్చకుడి సస్పెన్షన్, ఈవో బదిలీ తర్వాత అంతా గప్‌చుప్ అయింది. తాంత్రిక పూజలు ఎవరు.. ఎందుకు చేశారో ఇప్పటికీ తేలలేదు.
*గత ఏడాది సెప్టెంబరులో అమ్మవారి వెండిరథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహాలలో మూడు చోరీ అయ్యాయి. మహామండపంలో ఉన్న ఈ రథం నుంచి సింహాలను చోరీ చేశారు. ఇటీవల కరిగించిన వెండి రికవరీ చేశారు.
*2004లో అమ్మవారి గర్భగుడి గోపురాన్ని బంగారంతో తాపడం చేస్తూ అసంపూర్తిగా వదిలేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. రాగితో కల్తీ జరిగిందన్న వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంలో రూ.లక్షలు వృథా అయ్యాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీన్నీ ఏమీ తేల్చలేదు.
*2007-08లో ఘాట్‌రోడ్డులో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. దీంతో రూ.50 కోట్లతో ఘాట్‌రోడ్డు విస్తరణ, రిటైనింగ్ గోడలు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. పనులు అసంపూర్తిగా వదిలేశారు.
*గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో సీఎం రాకకు కొద్ది నిమిషాల ముందు కొండరాళ్లు పడ్డాయి. తర్వాత దుర్గాఘాట్ ఎదురుగా ఒక రిటైనింగ్ గోడ కట్టారు. రూ.3కోట్ల అంచనా వ్యయానికి రూ.5కోట్లు ఖర్చు చేశారు. దీనిపై విచారణ జరిపి నాణ్యత లేదని తేల్చినా.. చర్యలు లేవు.
*తిరుపతి క్యూకాంప్లెక్సు తరహాలో రూ.75 కోట్లతో మహామండప నిర్మాణం తలపెట్టారు. నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. ఆరు అంతస్తులు కట్టారు. ఇందులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. పరిహారం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. 2016లో కొన్ని కట్టడాలను కూల్చినందుకు రూ.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
*నాలుగేళ్ల క్రితం నెయ్యి కుంభకోణం వెలుగుచూసింది. ప్రసాదాలకు వినియోగించాల్సిన నెయ్యిని భారీ మొత్తంలో దారి మళ్లించారు. ఎవరినీ బాధ్యులుగా చేయలేదు.
*భక్తులు అమ్మవారికి రూ.లక్షలు విలువచేసే చీరలు కానుకగా ఇస్తారు. గతంలో పెద్దఎత్తున చీరలు మాయం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక విలువైన చీర మాయంపై పాలకవర్గ సభ్యురాలిని తొలగించి, పోలీసు కేసు పెట్టారు.
*అర్జున వీధిని కుదించేశారు. 100 అడుగుల రోడ్డు కాస్తా.. 30 అడుగులు చేసి గోడ కట్టించేశారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది. దీనివల్ల అక్కడి ఆస్తుల విలువ తగ్గిపోయింది.
*ఇటీవల ఓ పాలకవర్గ సభ్యురాలి వాహనంలో తెలంగాణ మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేశారు.
*ప్రతినెలా అమ్మవారి హుండీ లెక్కిస్తారు. ఇక్కడ కానుకల్లో వచ్చిన బంగారాన్ని కొందరు కాజేస్తారు. లెక్కించేటప్పుడే కాగితాల్లో చుట్టి బయట పడేస్తారు. అక్కడ ముందుగానే ఉన్న వ్యక్తి వాటిని సేకరిస్తుంటారు. పాలకవర్గం లోపాలు, నిర్వాహక వ్యవస్థ అవినీతి దీనికి కారణాలుగా అనిశా తేల్చింది.
తమవాళ్లకే టెండర్లు