ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాల్లో విద్యార్థులు, భాజపా నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. స్కాలర్షిప్లు, వసతి గృహాల బకాయిల విడుదలతో పాటు విద్యా సంవత్సరం వృథా కాకూడదని ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. ప్రజా సమస్యలపై భాజపా నేతలు ఆందోళన చేపట్టారు.
విజయనగరం జిల్లాలో...
విద్యార్థుల వసతి గృహాల ఛార్జీలు, పెండింగ్ స్కాలర్షిప్లను.. ఈ ఏడాది ప్రవేశాలు ముగిసేలోగా విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా నాయకులు వంశీ కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ ముట్టడికి వెనకాడేది లేదని స్పష్టం చేశారు. వందలకొద్దీ విద్యార్థులతో కలిసి.. విజయనగరం జిల్లా చీపురుపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలపై స్పష్టత ఇవ్వకుండా.. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మద్యం షాపులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని విమర్శించారు.
దాసన్నపేట సమీపంలోని ఎర్ర చెరువును ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారని.. భాజపా విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆరోపించారు. చెరువును ఆక్రమించి, విక్రయాలు జరుపుతున్న స్థిరాస్తి వ్యాపారులకు.. ప్రభుత్వం కొమ్ము కాస్తోందంటూ అక్కడ నిరసన చేపట్టారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి చెరువుకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమంచి సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్‌తో సహా పార్టీలోని ఇతర నేతలు పాల్గొన్నారు.
విజయవాడలో...
ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు నిరసనకు దిగారు. ఇంటర్ బోర్డు అస్తవ్యస్థ నిర్ణయాలతో లక్షలాది విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా.. వివిధ కోర్సులకు తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కళాశాలలు తెరిచి, హాస్టళ్లు తెరవకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే వసతి గృహాలు తెరిచి భోజన సదుపాయం కల్పించాలన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.