ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

No lands to Industrialists: పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపు రద్దు

No lands to Industrialists: కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపును రద్దు చేస్తూ.. ఏపీఐఐసీ నోటీసులు జారీ చేస్తోంది. కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉండటంతో రద్దు చేయాల్సి వస్తుందని పేర్కొంది.

Abolition of land allotment to industrialists
పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపు రద్దు

By

Published : Jul 6, 2022, 9:41 AM IST

No lands to Industrialists: కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపును రద్దు చేస్తూ.. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) నోటీసులు జారీ చేస్తోంది. గత నాలుగు రోజుల్లో మొత్తం 170 మందికి నోటీసులు అందాయి. కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉండటంతో రద్దు చేయాల్సి వస్తుందని పేర్కొంది. కొండలు, గుట్టలు, లోయలు, వివాదాస్పద భూముల్లో ఉన్న ప్లాట్లనూ రద్దు చేసింది.

పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసిన అయిదేళ్ల తర్వాత ఇవన్నీ ఏపీఐఐసీకి గుర్తుకురావడం గమనార్హం. భూములను కోల్పోయిన వారికి ఇదే పారిశ్రామిక పార్కులో మరో చోట కేటాయిస్తామని ప్రతిపాదించింది. పెంచిన ధర ప్రకారం మిగిలిన మొత్తాన్ని చెల్లించాలన్న నిబంధన విధించింది. ఈ కారణంగా ఒక్కో ఎకరాకు రూ.38.5 లక్షల అదనపు భారం పారిశ్రామికవేత్తలపై పడనుంది. భూముల కోసం నాలుగేళ్ల కిందటే పూర్తి మొత్తాన్ని చెల్లించి ఎదురుచూస్తున్న తమపై ఇప్పుడు పెరిగిన ధరల భారాన్ని ఏపీఐఐసీ మోపడం ఏంటి? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

ఇదొక రద్దుల పార్కు..ఏపీఐఐసీ నిబంధన ప్రకారం పారిశ్రామిక పార్కుల్లో భూములు పొందిన పారిశ్రామికవేత్తలు రెండేళ్లలో యూనిట్లను ఏర్పాటు చేయాలి. మల్లవల్లి విషయంలో మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి కేవలం ఏడాదిలో ఏర్పాటు చేయాలన్న నిబంధన విధించారు. కొన్ని భూములకు సంబంధించి పరిహారం చెల్లింపులో, యాజమాన్య హక్కు వివాదాల కారణంగా అప్పట్లోనే కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఇవేమీ పట్టించుకోకుండా 1,360 ఎకరాల్లో మల్లవల్లి పారిశ్రామిక పార్కును ఏపీఐఐసీ పనులు చేపట్టింది.

ఇందులో 1,165.73 ఎకరాల్లో మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు వీలుగా 1,104 ప్లాట్లను అభివృద్ధి చేసింది. 2018లో దాదాపు 612 మంది పారిశ్రామికవేత్తలకు సుమారు 837 ఎకరాలను కేటాయించింది. ఇందులో కోర్టు లిటిగేషన్‌, గుట్టలు, లోయలు ఉన్న ప్లాట్లు కూడా ఉన్నాయి. అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితి లేకపోవడంతో యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఇలా సుమారు 170 ప్లాట్లకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. దీంతో పాటు నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో జాప్యం చేశారన్న కారణాలతో గతంలో 175 మందికి ప్లాట్ల కేటాయింపులు రద్దుచేస్తూ నోటీసులు జారీ చేసింది. పార్కులో కేటాయించిన 612 ప్లాట్లలో.. 345 ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయడమే పనిగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. అలా 56 శాతం రద్దయ్యాయి.

ఇంత భారమా?..పారిశ్రామిక పార్కులో చదరపు మీటర్‌ రూ.408 వంతున ధరను అప్పట్లో ఏపీఐఐసీ నిర్దేశించింది. దీని ప్రకారం ఎకరా రూ.16.5 లక్షలకు కేటాయించింది. నోటీసులు అందుకున్న 170 మంది పారిశ్రామికవేత్తలంతా గతంలోనే నిర్దేశిత మొత్తాన్ని చెల్లించారు. ఇప్పుడు వారి ప్లాట్లను రద్దు చేస్తే.. మళ్లీ ఇంకో చోట కొత్త ప్లాటు కేటాయిస్తే సరిపోతుంది. అలా చేయకుండా పెంచిన ధర చెల్లిస్తేనే మళ్లీ కేటాయిస్తామన్న నిబంధన తెచ్చింది.

ప్రస్తుతం అక్కడ చ.మీ రూ.2,204 వంతున నిర్దేశించింది. దీని ప్రకారం ఎకరా రూ.63.5 లక్షలు అవుతుంది. గతంలోనే పూర్తి మొత్తాన్ని చెల్లించిన కారణంగా 170 మందికి మాత్రం ప్లాటు ధరలో కొంత రాయితీ ఇస్తూ.. చ.మీ రూ.1,627 వంతున చెల్లించాలన్న షరతు పెట్టింది. దీని ప్రకారం చ.మీకు రూ.1,219 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సుమారు మూడు రెట్లు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన ధర ప్రకారం ఎకరా రూ.55 లక్షలు అవుతుంది. దీనికి సిద్ధపడితే మరో చోట ప్లాట్లను కేటాయిస్తామని.. లేకుంటే నాలుగేళ్ల కిందట చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని చెబుతోంది.

మౌలిక సదుపాయాలను అభివృద్ధికి సుమారు రూ.405 కోట్ల వెచ్చించామని.. దీనివల్లే భూముల ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. కోర్టు వివాదంలో ఉన్న భూములు, కొండలు, గుట్టలు, లోయలు ఉన్న భూముల్లో ఉన్న ప్లాట్లను కేటాయించకుండా ఏపీఐఐసీ అప్పట్లో నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. అప్పట్లోనే పూర్తి మొత్తాన్ని చెల్లించాం కాబట్టి.. ఇప్పుడూ అదే ధరకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details