ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ABV: 'వారిపై పరువు నష్టం దావా వేస్తా.. అనుమతివ్వండి' - ఏబీవీ తాజా వార్తలు

తనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన ఐదుగురిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖ, సీఎస్​కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. మీడియాలో వచ్చిన కథనాలు తనతోపాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు బాధ కలిగించాయని లేఖలో పేర్కొన్నారు.

ABV
ABV

By

Published : Mar 28, 2022, 7:19 PM IST

Updated : Mar 29, 2022, 6:02 AM IST

వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముఖ్యమంత్రి సీపీఆర్వో పూడి శ్రీహరి, సాక్షి పత్రిక ఎడిటర్‌ వి.మురళి, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌ సహా మరికొందరిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు. వీరంతా తనపైనా, తన కుటుంబసభ్యులపైనా దేశద్రోహం సహా అనేక అసత్య ఆరోపణలు, నిందలు మోపి, దుర్భాషలాడి పరువుకు నష్టం కలిగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘2020 ఫిబ్రవరి 8వ తేదీ అర్ధరాత్రి నన్ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ముఖ్యమంత్రి సీపీఆర్వోగా పనిచేస్తున్న పూడి శ్రీహరి అదే రోజు రాత్రి.. నాపైన నిరాధార, నిందాపూరిత ఆరోపణలతో కూడిన ఆరు పేజీల పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను మీడియాకు విడుదల చేశారు. దాని ఆధారంగా ఆ అవాస్తవాలన్నీ మీడియాలో ప్రచురితమయ్యాయి. అవి నాకు తీవ్ర బాధ కలిగించాయి. 2020 డిసెంబరు 18న నాపై అభియోగాలు నమోదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ అభియోగాల్లో అంతకు ముందు పూడి శ్రీహరి విడుదల చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లోని ఒక్క ఆరోపణ కూడా లేదు. విచారణ సమయంలోనూ అలాంటి అభియోగాలేవీ నమోదు చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే శ్రీహరి నా పరువుకు నష్టం కలిగించారు. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నందున నాపై అతను చేసిన తప్పుడు ఆరోపణల్ని దుష్ప్రవర్తన కింద పరిగణించాలి. అతనిపైన క్రమశిక్షణ, ఇతర పరిపాలనపరమైన చర్యలు తీసుకోవాలి. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నాపైన నిరాధార ఆరోపణలు చేశారు. నా పాస్‌పోర్టు సీజ్‌ చేయాలని కూడా మాట్లాడారు. సాక్షి పత్రిక ఎడిటర్‌ వి.మురళి, సాక్షి పత్రిక, ఛానళ్లు ఈ తప్పుడు ఆరోపణల్ని వ్యాప్తి చేసి నా పరువుకు నష్టం కలిగించాయి. వారందరిపైనా పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలి’ అని ఆ లేఖలో వివరించారు.

అవన్నీ అవాస్తవాలే: పెగాసస్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను ఏబీ వెంకటేశ్వరరావు గతంలోనే ఖండించారు. నిఘా విభాగాధిపతిగా తాను పనిచేసిన కాలంలో పెగాసస్‌ను కొనలేదని.., వాడలేదని తేల్చిచెప్పారు. పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలున్నాయని.. ప్రజల భయం, ఆందోళనకు తెరదించాలని పేర్కొన్నారు.పెగాసస్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదన్నారు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా.. ఆ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముకోవడానికి వెళ్లినవారు ఆమెను కలిసినప్పుడు.. ఫలానా వారు కొన్నారని ఆమెకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చని వారు నాతో అన్నారని తెలిపారు. ట్రోజన్లు, మాల్‌వేర్‌లు వంటివీ ప్రభుత్వపరంగా వినియోగించలేదని చెప్పారు. 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు వరకూ తాను నిఘా విభాగాధిపతిగా కొనసాగానని.. ఆ తర్వాత రెండు నెలల వరకూ ఏం జరిగిందో తెలుసని చెప్పారు. తన హయాంలో ఫోన్లు ఏవీ ట్యాప్‌ కాలేదన్న భరోసా ఇస్తున్నానని చెప్పారు.

2019 మే తర్వాత పెగాసస్‌ కొన్నారో లేదో నాకు తెలీదు: "పెగాసస్‌ వ్యవహారంలో 2019 మే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే తాము పెగాసస్‌సాఫ్ట్‌వేర్‌ కొనలేదంటూ 2021 ఆగస్టులో డీజీపీ కార్యాలయమే సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తికి సమాధానమిచ్చింది. ఇతర విభాగాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్నాయేమోనన్న సందేహం ఎవరికైనా ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగొచ్చు. ఈ అంశంపై ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినా ఫరవాలేదు. జనాల్లో అపోహలు, సందేహాలు, ఆందోళనలు రేకెత్తించేందుకే పెగాసస్‌ వ్యవహారంలో కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై కనీసం శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఈ వ్యవహారంలో అసత్యాలు, విష ప్రచారాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌, సీపీఆర్వో పూడి శ్రీహరి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్‌, అబ్బయ్య చౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్‌ పత్రిక, స్వర్ణాంధ్ర, గ్రేటాంధ్ర వెబ్‌సైట్లపై పరువు నష్టం దావా వేస్తా" అని ఆయన ఇంతకుముందే చెప్పారు. అందులో భాగంగానే సాధారణ పరిపాలన శాఖకు ఇవాళ లేఖ రాశారు.

ఇదీ చదవండి: అప్పుడు పెగాసస్‌ కొనలేదు.. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఏబీవీ

Last Updated : Mar 29, 2022, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details