Blind Stick: సాధారణంగా కళాశాలలో ప్రాజెక్టులంటే విద్యార్థులకు అనుభవంలోని ఏదైనా సమస్యని ఎంచుకుని దానికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ఓ యువతి చేసిన ప్రాజెక్టు... అంధులకు, వయో వృద్ధులకు ఆసరాగా నిలుస్తోంది. వారు చూపు సరిగా లేక ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది విజయవాడకు చెందిన సాయి కీర్తి...
Blind Stick: ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్న సాయి కీర్తి... కాలేజీలో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి వచ్చింది. ఏ అంశాన్ని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలోనే...వాళ్ల తాతయ్య కళ్లు మసకబారడం వల్ల ఏర్పడిన ఇబ్బందులు గుర్తుకు వచ్చాయి. ఇన్నాళ్లు చూపు ఉండి....క్రమంగా చూపు మందగించటం వల్ల నడిచేందుకు, వస్తువుల్ని గుర్తించేందుకు ఆయన బాధపడడాన్ని చూసి...ఆ అంశాన్నే తన ప్రాజెక్టుకు ఎంచుకుంది.
Blind Stick: తన కాలేజీ స్నేహితులు జాహ్నవి, కృతికలతో కలిసి బ్లైండ్ స్టిక్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. వివిధ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని, వాటికి సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని కనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్ని రోజుల శ్రమించి..ఈ బ్లైండ్ స్టిక్‌ను తయారు చేసింది. సాధారణ చేతికర్రలతో పోల్చితే... దీన్ని మరింత సులువుగా వాడేలా రూపొందించింది సాయి కీర్తి.
Blind Stick: ఈ చేతి కర్రను పట్టుకునే నడుస్తుంటే...ఎదురుగా ఏవైనా వస్తువులు వస్తే సెన్సార్ల సాయంతో గుర్తించి బీప్ శబ్దాన్ని చేస్తుంది. దాంతో... అక్కడి వస్తువులకు తగలకుండా తప్పుకుని వెళ్లేలా ఈ చేతికర్రను వాడుతున్న వాళ్లు గ్రహిస్తారు. అంతే కాదు... ఇంట్లో, రోడ్లపై నీళ్ల తడి ఉంటే... జారి పడిపోయే అవకాశాలెక్కువ. చాలా మంది వృద్ధులు ఇలానే కిందపడిపోతుంటారు. ఈ కారణంగానే.. కర్ర అడుగు భాగంలో నీటిని గుర్తించేలా ప్రత్యేక సెన్సార్లు అమర్చారు. నడిచే దారిలో నీటి ఆనవాళ్లు గుర్తిస్తే... వాయిస్ రూపంలో హెచ్చరిస్తుంది ఈ చేతికర్ర. . మార్కెట్‌లో ఇలాంటి సౌకర్యాలున్న చేతికర్ర రూ.5 వేలకు లభ్యం అవుతుండగా... ఈమె మాత్రం రూ.2 వేల ఖర్చుతోనే రూపొందిస్తోంది.