ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చోరికి వచ్చి.. ఎదురు తిరిగిన మహిళ కాళ్లు, చేతులు కట్టేసి హత్య - woman murdered news

woman murdered in vijayawada : విజయవాడలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. పోలీసులంతా వైకాపా ప్లీనరీ పనిలో బిజీగా ఉంటే.. దొంగలు తమ పనికానిచ్చేశారు. పట్టపగలే సత్యనారాయణపురం రైల్వే కాలనీ చోరీకి వచ్చి.. ఎదురుతిరిగిన మహిళను అతి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సీత
సీత

By

Published : Jul 12, 2022, 7:51 PM IST

woman murdered in vijayawada : విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీలో పట్టపగలే దొంగలు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. చోరీకి వచ్చి, ఎదురు తిరిగిన మహిళ మెడకు టవల్‌ బిగించి చంపేశారు. నగరంలో పోలీసులంతా వైకాపా ప్లీనరీ నేపథ్యంలో బిజీగా ఉంటారని, ఇదే అదనుగా భావించి దుండగులు ఈ ఉదంతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని 75/బి క్వార్టర్‌లో నివసించే కె.సత్యనారాయణ రైల్వే ఎస్‌ అండ్‌ టీ విభాగంలో పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో యథావిధిగా ఉద్యోగానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి వచ్చారు. భార్య సీత(50) ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికుల సహాయంతో వెనుక నుంచి లోపలికి వెళ్లి చూడగా.. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోటిలో వస్త్రాలు కుక్కి స్పృహ లేనిస్థితిలో పడి ఉంది. వెంటనే రైల్వే ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా గాలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ముగ్గురు యువకులు ఉదయం నుంచి ఆ ప్రాంతంలో తచ్చాడినట్లు సమీపంలో నివసించే రైల్వే సిబ్బంది చెబుతున్నారు.

అంతర్‌రాష్ట్ర ముఠా పనేనా..? :ఐదు రోజుల క్రితం సత్యనారాయణపురం సిద్ధార్థ పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూలేని వేళ, పట్టపగలు ఉదయం 11 నుంచి ఒంటి గంట మధ్యలో దొంగలు పడ్డారు. 9 కాసుల బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులు దొంగిలించారు. తాజాగా ఘటనలోనూ అదే సమయంలో జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేవని నిర్ధారించుకొని, ముందుగానే పథకం ప్రకారం దొంగలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. పది రోజుల ముందుగానే రెక్కీ నిర్వహించి, ఒంటరిగా మహిళలు ఉంటున్న ఇళ్లను ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వైకాపా ప్లీనరీ నేపథ్యంలో పోలీసులు పెద్దగా లేరని నిర్ధారించుకునే దొంగతనానికి వచ్చి, ఈ దురాఘతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీత కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో వస్త్రం కుక్కారు. గొంతుకు టవల్‌ చుట్టి ప్రాణాలు తీశారు. ఆమె ధరించిన ఆభరణాలతోపాటు బీరువాలోని లాకర్లలో ఉన్న మొత్తం రూ.2.5లక్షలు విలువచేసే ఆరు కాసుల బంగారాన్ని, వెండిని చోరీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ బాలమురళీ కృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details