ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAINS UPDATE: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం..నేడు తీరం దాటే అవకాశం - తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

WEATHER UPDATE
WEATHER UPDATE

By

Published : Sep 25, 2021, 10:52 PM IST

Updated : Sep 26, 2021, 3:59 AM IST

22:39 September 25

WEATHER UPDATE

తుపానుగా మారిన తీవ్ర వాయుగుండంగా(WEATHER UPDATE) మారింది. దీని ప్రభావంతో.. నేడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గోపాలపూర్‌కు 370, కళింగపట్నానికి 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నేటి సాయంత్రం గోపాలపూర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలుస్తోంది. తుపాను వల్ల అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవడంతో పాటు తీరం వెంబడి 75-95 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తుల శాఖ కమిషనర్‌ తెలిపారు. 

ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుపానుగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 17 కి.మీ. వేగంతో తీరం వైపు వస్తున్న తీవ్ర వాయుగుండం.. కళింగపట్నంకు 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. రేపు సాయంత్రం గోపాల్‌పూర్ - కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.  

మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు...  

తీవ్ర  వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతాల్లో 55-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపానుగా బలపడే కొద్దీ తీరంలో గాలుల వేగం పెరిగే సూచన ఉన్నట్లు అధికారులు చెప్పారు. కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశాలో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు, మరో 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, విదర్భలోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

హెచ్చరికలు జారీ...  

తుపాను ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ఒడిశా, కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను తీరం దాటే సమయంలో పూరిళ్లు దెబ్బతింటాయని, విద్యుత్ లైన్లు, సెల్ టవర్లు, చెట్లు కూలే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉన్నందున  వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.  

సహాయకచర్యలు ముమ్మరం...

కోస్తాంధ్రకు తుపాను హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.  ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్ల విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలు, అత్యవసర సామగ్రిని సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రాల సంసిద్ధతపై సమీక్ష...  

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంపై దిల్లీలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్రాలు చేపట్టిన సంసిద్ధతపై చర్చించారు. నష్ట నివారణ చర్యలు, ప్రభుత్వ పునరావాస చర్యలపై సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సన్నాహక చర్యలను వివరించాయి. 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ ప్రభావంతో తుపాను తీవ్రరూపం దాల్చకముందే జాగ్రత్తలు తీసుకోవాలని రాజీవ్ గౌబా సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతున్నందున తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  

ఇదీ చదవండి: 

Rains in hyderabad: హైదరాబాద్​లో భారీ వర్షం... అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

Last Updated : Sep 26, 2021, 3:59 AM IST

ABOUT THE AUTHOR

...view details