విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం దశాబ్దాల కిందట ఎలా ఉందో... ఇప్పుడూ అచ్చం అలాగే ఉంది. కొండపై ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, మల్లేశ్వరస్వామి గుడి తప్ప చెప్పుకోదగ్గవి ఇంకేమీ లేవు. కొండపై గత పదిహేనేళ్లలో రూ.కోట్లు వెచ్చించి అనేక భవనాలు నిర్మించారు. కానీ... కట్టిన వాటిని కట్టినట్లే దాదాపు అన్నీ కూల్చేశారు. ఆలయానికి ఈవోలు మారిన ప్రతిసారీ.. అభివృద్ధి పేరిట కొత్తగా నిర్మాణాలను చేపట్టడం... పాత వాటిని కూలగొట్టడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా గత పదేళ్లలో పది మంది ఈవోలు మారారు. మారిన ప్రతిసారీ కొత్త ప్రణాళికలు పుట్టుకొస్తున్నాయి. అయితే... అధికారులు భక్తుల దీర్ఘకాలిక అవసరాలకు కాకుండా... సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారులు సైతం తొలుత నిర్మాణాలకు, తర్వాత కూల్చివేతలకు ప్రణాళికలు రచిస్తుండటం గమనార్హం. ఈ విభాగంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికారులు నచ్చినట్లు పనులు చేయిస్తూ... అమ్మవారి హుండీ ఆదాయాన్ని విచ్చలవిడిగా కరిగించారు. ప్రస్తుతం కొండపై ఆలయాలతోపాటు కొత్తగా కట్టిన ఓ మూడు గదుల నిర్మాణం తప్ప మరేం లేవు. అంతా తుడిచిపెట్టేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.70 కోట్లతో తాజా నిర్మాణాలకు మళ్లీ ప్రణాళికలు రూపొందించారు.
విజయవాడ దుర్గగుడి కొండపై గతంలో ఈవో కార్యాలయం, పరిపాలన భవనం, భవానీదీక్ష మండపం అన్నీ ఒక్కచోటే ఉండేవి. వీటితోపాటు క్యూలైన్ల కోసం నిర్మించిన మార్గాలను సైతం ఆలయ అభివృద్ధి పేరిట 2015లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి తొలగించారు. ప్రస్తుతం అక్కడ మూడు రేకుల షెడ్లు మాత్రమే వేశారు. ఇప్పటికీ ఈవోకు సరైన కార్యాలయం లేదు. గతంలో వివిధ వస్తువులను భద్రపరిచేందుకు ఉపయోగించిన మూడు గదులను ప్రస్తుతం ఈవో కార్యాలయంగా వాడుకుంటున్నారు. ఈవో మారినప్పుడల్లా.. వారికి నచ్చినచోట కార్యాలయం పెట్టుకుంటున్నారు.
రూ.56 లక్షలతో కేశ ‘ఖండనం’
పట్టణంలో ఫ్లైవోవర్ నిర్మాణానికి దుర్గాఘాట్‌లోని కేశఖండనశాలను తొలగించారు. కొండ దిగువన ఖాళీగా ఉన్న అరండల్ సత్రంలోకి మార్చితే సరిపోయేది. కానీ.. కనకదుర్గానగర్‌లో 2015లో రూ.56 లక్షలతో కేశఖండనశాల కోసం తాత్కాలిక షెడ్డు వేసి, బోరుబావిని తవ్వించారు. కొద్దికాలానికే అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారంటూ... అరండల్ సత్రానికి రూ.10 లక్షలతో మరమ్మతు చేయించి... కేశఖండనశాలను అక్కడికి మార్చారు. తర్వాత 2016లో రోడ్ల విస్తరణ పేరిట షెడ్డును తొలగించారు.
నిర్మాణానికి రూ.కోటి...కూల్చేందుకు రూ.25 లక్షలు
ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఆలయం పక్కనే 2007లో రెండంతస్థుల్లో రూ.కోటితో అన్నదాన భవనం నిర్మించారు. పైభాగంలో అన్నదానం, కింద ప్రసాదం పోటు ఉండేవి. పదేళ్లు తిరగకముందే 2016లో ఆలయ అభివృద్ధి పేరిట రూ.25 లక్షలు ఖర్చుపెట్టి ఈ భవనాన్ని కూల్చేశారు.
రూ.45 లక్షలతో షెడ్డు...ఆపై వదిలేసి అదనపు ఖర్చు
కొండ దిగువన అర్జునవీధిలోని శృంగేరీసత్రాన్ని అన్నదానం కోసం అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.5 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ 2016లోనే రూ.45 లక్షలతో రేకుల షెడ్డు వేశారు. కానీ.. సత్రంలోకి దుమ్ముధూళి రావడం, భక్తులు నిల్చునేందుకూ స్థలం లేకపోవడంతో విమర్శలు వచ్చాయి. దీంతో 2018లో కొత్త ఈవో వచ్చిన వెంటనే అన్నదాన సత్రాన్ని మహా మండపంలోని రెండో అంతస్థులోకి మార్చారు. కొండ దిగువన ప్రసాదాలను సిద్ధంచేసి వాటిని రోజూ పైకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం నెలకు రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతోంది.
స్టీలు క్యూలైన్లు...నిర్ణయం ఖరీదు రూ.5 కోట్లు
మల్లికార్జున మహామండపంలో స్టీలు క్యూలైన్ల ఏర్పాటుకు 2014లో రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత ఒక్క ఏడాది తర్వాత ఈవో మారగానే వాటిని తొలగించి పక్కన పడేశారు.
లేజర్ షోకు.. రూ.3 కోట్లు కుమ్మరింత
అమ్మవారి చరిత్రను భక్తులకు నిత్యం వివరించేలా రూ.3 కోట్లతో లేజర్ షోను 2018లో రూపొందించారు. ప్రస్తుతం దాన్నీ మూలన పడేశారు.