ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Robbers on High way: జాతీయ రహదారిపై దొంగల ముఠా.. కత్తులతో బెదిరిస్తారు.. ఉన్నదంతా దోచేస్తారు!

ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా పేట్రేగిపోతుంది. రహదారిలో వెళ్తున్న వాహనదారులను కత్తులతో బెదిరించి నగదు దోచుకుంటారు. కృష్ణా జిల్లా నక్కలంపేట, కంచికచర్ల వద్ద చోటుచేసుకున్న ఈ దోపిడీలను సీరియస్‌గా తీసుకున్న కంచికచర్ల పోలీసులు.. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

A gang of robbers at national highway
జాతీయరహదారిపై దోపిడీ దొంగల ముఠా

By

Published : Jul 11, 2021, 7:59 PM IST

Updated : Jul 11, 2021, 8:51 PM IST

పగలు... రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ... కొందరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై మెరుపులా వచ్చి రహదారిపై వెళ్తున్న లారీలు, కార్లను హఠాత్తుగా ఆపుతారు. సొమ్ము ఇవ్వాలని వాహనదారులు, డ్రైవర్లను కత్తులతో బెదిరిస్తారు. మరో ప్రాంతంలో రాత్రి వేళ లారీ ఆగిందంటే చాలు... గద్దల్లా వాలిపోతారు. క్యాబిన్‌లో ఆదమరిచి నిద్ర పోతున్న డ్రైవర్లను తట్టి లేపుతారు.

వారి వద్ద ఉన్న నగదు ఇవ్వాలని అడుగుతారు. ఇస్తే సరి... లేకుంటే భయాందోళనలకు గురి చేసి మరీ డబ్బులు లాక్కుని పరారవుతారు. సినిమా తరహాలో కృష్ణా జిల్లా కంచికచర్ల ప్రాంతంలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు లారీ డ్రైవర్లలో గుబులు రేపుతున్నాయి. లారీలను లక్ష్యంగా చేసుకుని కొందరు డ్రైవర్లను బెదిరించి నగదు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని డ్రైవర్లు నగదు దుండగులకు అప్పజెప్పి తమ గోడును పోలీసులకు వెళ్లబోసుకుంటున్నారు.

  • రెండు రోజుల కిందట అర్ధరాత్రి కంచికచర్ల మండలం నక్కలంపేట క్రాస్‌ రోడ్డు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీని ఐదుగురు వ్యక్తులు మోటారు సైకిళ్లు అడ్డుపెట్టి ఆపారు. డ్రైవర్‌ వద్ద ఉన్న సొమ్ము ఇవ్వాలని అడిగారు. అతడు ససేమిరా అనడంతో కత్తులతో బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.6,500 తీసుకొని ఉడాయించారు. హైదరాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్‌... దోపిడీ గురించి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  • ఇటీవల హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీని, అలసటకు గురైన డ్రైవర్‌ కీసర సమీపంలో ఆపాడు. రాత్రి కావడంతో నిద్ర పోయాడు. కొద్దిసేపటికి ఇద్దరు వచ్చి డ్రైవర్‌ని నిద్ర లేపి డబ్బులు డిమాండ్‌ చేశారు. అతను తన వద్ద ఉన్న రూ.1000 వారికి ముట్టజెప్పాడు. డబ్బు తీసుకున్న విషయం ఎవరికీ చెప్పవద్దని లారీ డ్రైవర్‌ను దుండగులు బెదిరించారు. డ్రైవర్‌ స్థానికుడు కావడంతో ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయాడు. ఇటువంటి ఘటనలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముమ్మరంగా దర్యాప్తు

నక్కలంపేట వద్ద జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న కంచికచర్ల పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. దుండగులు కత్తులతో బెదిరించి మరీ నగదు తీసుకెళ్లడం దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. వారు ఎలా ఉంటారనే వివరాలను డ్రైవర్‌ దగ్గర సేకరించి పాత నేరస్థులెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితులు కంచికచర్ల ఇందిరా కాలనీ వాసులుగా గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి:

ap fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం

Last Updated : Jul 11, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details