ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నారికి పాలిస్తూ.. తనువు చాలించిన తల్లి - nagarkurnool district latest news

ఆమె.. రెండు నెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు మందులు వాడితే సమస్య తగ్గిపోతుందంటూ ఇంటికి పంపించారు. అంతా బాగానే ఉందనుకునేలోగా.. ఒక్క ఘడియ ఆమెను ఈ లోకం నుంచి దూరం చేసేసింది. పొత్తిళ్లలో పాలు తాగుతున్న బిడ్డకు అమ్మను దూరం చేసేసింది.

1
1

By

Published : Jul 25, 2022, 7:13 PM IST

నెలల పసికందుకు పాలిస్తూనే.. ఓ మాతృమూర్తి తనువు చాలించిన హృదయ విదారక ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన జయశ్రీ (25) తొలి కాన్పు కోసం నేరళ్లపల్లిలోని పుట్టింటికి వచ్చింది. రెండు నెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇటీవల జయశ్రీకి స్వల్ప అస్వస్థతగా ఉండటంతో భర్త ప్రశాంత్‌ తిర్మలాపూర్‌ నుంచి శనివారం వచ్చి మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె గుండె వాల్వులో చిన్న ఇబ్బంది ఉందని, మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో మళ్లీ నేరళ్లపల్లికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో జయశ్రీ తన బిడ్డకు పాలిస్తూ.. అలాగే మృత్యు ఒడికి చేరుకుంది. కాసేపటికి తాత, అమ్మమ్మ టీ కోసం పిలిచినా ఆమె లేవలేదు. అనుమానంతో వారు పరిశీలించగా.. మృతి చెందినట్లు గుర్తించి ఘొల్లుమన్నారు. జయశ్రీ తల్లిదండ్రులు, అత్తమామలు తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లడంతో.. వృద్ధులు వెంటనే ఆమె భర్తకు సమాచారమిచ్చారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details