ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమాజంలో పెద్దమనిషిగా చలామణి... కుమార్తె వయసున్న బాలిక పట్ల వక్ర బుద్ధి - వినోద్​జైన్ అరెస్టు

GIRL SUICIDE IN VIJAYAWADA : సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ, కుమార్తె వయసున్న బాలిక (14) పట్ల వక్ర బుద్ధిని ప్రదర్శించాడో దుర్మార్గుడు. అతని అసభ్యకర మాటలు, లైంగిక చేష్టలను భరించలేకపోయిన బాలిక నిస్సహాయ స్థితిలో తనువు చాలించింది. తాము నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

వినోద్‌ జైన్‌
వినోద్‌ జైన్‌

By

Published : Jan 31, 2022, 5:37 AM IST

Updated : Jan 31, 2022, 5:51 AM IST

GIRL SUICIDE IN VIJAYAWADA :విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్​లో దారుణం చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు భరించలేక 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. అపార్ట్​మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించి, బాలిక రాసిన లేఖ ఆదివారం వెలుగు చూడటంతో సంచలనంగా మారింది. ఇదే అపార్ట్‌మెంటులో నాలుగో అంతస్తులో నివాసం ఉండే వినోద్‌ జైన్‌ (55) బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలోనూ తేలింది. అతనిపై లైంగిక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై 306, 354ఏ సెక్షన్‌లతో పాటు మృతురాలు మైనర్‌ కావడంతో పోక్సో కింద కేసులు పెట్టారు. ఎస్సై ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీటి సిరాతో లేఖ!

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక రోజూ అపార్ట్‌మెంటుపై వాకింగ్‌కు వెళ్తుండేది. ఆ సమయంలో వినోద్‌ వచ్చి వెంబడించేవాడు. తల్లిదండ్రులకు చెప్పలేని బాలిక మానసికంగా ఆందోళనకు గురైంది. ఆత్మహత్యకు సిద్ధపడి శనివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది. పైభాగంలో అంచున కూర్చొని ఉండగా, గమనించిన కొందరు పక్కకు రావాలంటూ వారించడంతో వచ్చేసింది. కాసేపటికి మళ్లీ వెళ్లి పైనుంచి దూకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

అమ్మా.. నేనీ విషయాన్ని...

అంతకుముందు బాలిక రాసిన మూడు పేజీల లేఖను పోలీసులు గుర్తించారు. అందులో కొంతభాగం వెలుగులోకి వచ్చింది. ‘అమ్మా.. నేనీ విషయాన్ని మొదట్లోనే చెప్పలేదు. చాలా భయపడ్డా. సిగ్గుగా భావించా. జీవితంలో ఇంకేదైనా సమస్య వస్తే చనిపోయేదాన్ని కాదేమో! ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాను. దీనంతటికీ కారణం వినోద్‌జైన్‌. రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ నా శరీరాన్ని తాకుతున్నాడు. మన ఫ్లాట్‌కు వచ్చీపోయేటప్పుడు లిఫ్ట్‌, మెట్ల దగ్గర అసభ్యంగా మాట్లాడుతూ, శరీర భాగాలను తాకేవాడు. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు. తప్పని పరిస్థితి వచ్చింది’ అని ఆంగ్లంలో లేఖ రాసింది. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం బాలిక మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌ వద్దకు తీసుకురాగా, స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. వినోద్‌జైన్‌ను ఉరి తీయాలని, తమకు అప్పగిస్తే చంపేస్తామంటూ నినాదాలు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పాప విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకటమహేష్‌, సీపీఎం, ఐద్వా నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

తెదేపా నుంచి వినోద్‌ బహిష్కరణ

వినోద్‌జైన్‌ స్థిరాస్తి వ్యాపారి. అపార్ట్‌మెంట్‌ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. 2014లో 39వ డివిజన్‌ నుంచి భాజపా టికెట్‌ ఆశించి, చివరకు స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయాడు. తెదేపాలో చేరాక, గతేడాది 37వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. నిందితుడు తెదేపా నేతలతో దిగిన ఫొటోలను వైకాపా శ్రేణులు ప్రచారం చేశాయి. ప్రతిగా నిందితుడు భాజపాలో ఉన్నప్పుడు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఉన్న ఫొటోలను తెదేపా నాయకులు బయటపెట్టారు. వినోద్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెదేపా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

మంత్రి వెలంపల్లి పరామర్శ

బాలిక బలవన్మరణానికి కారకుడైన తెదేపా నాయకుడు వినోద్‌ జైన్‌ను కఠినంగా శిక్షించాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలి బంధువులను పరామర్శించారు. బాలిక మూడు పేజీల లేఖ రాసిందంటే ఎంత వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాలిక లేఖ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడు వినోద్‌ను ఉరితీసినా తప్పు లేదన్నారు.

వైకాపావి నీచరాజకీయాలు

ఆడబిడ్డలకు అండగా నిలవడం చేతకాని వైకాపా నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బాలిక బలవన్మరణం ఘటన తెలియగానే వినోద్‌జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:STUDENT SUICIDE: బాలిక ఆత్మహత్య కేసు వ్యవహారంలో ఆ పార్టీ నేత సస్పెండ్.. ముమ్మరంగా విచారణ

భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏముందంటే ?

Last Updated : Jan 31, 2022, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details