ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దయనీయం: ఆసరా కోసం కుటుంబం ఎదురుచూపులు - ఆసరా కోసం కుటుంబం ఎదురుచూపు

సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. నాలుగేళ్ల కిందట తల్లి కాళ్లు చచ్చుబడి పోయాయి. ఆదుకుంటాడని ఆశపడిన తండ్రి ఆరు నెలల కిందట పక్షవాతం బారిన పడ్డారు. అండగా ఉంటాడనుకున్న రెండో కుమారుడి రెండు కాళ్లు మూడు నెలల నుంచి పని చేయడం లేదు. వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆసుపత్రులకు వెళ్లలేదు. ఏ వ్యాధి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి.. కనీసం ఈ ముగ్గురిలో ఒక్కరికైనా ఆసరా పింఛను అందితే కడుపు నిండా తిండి దొరుకుతుంది. బలహీన వర్గాల కాలనీలో అప్పటి తెదేపా ప్రభుత్వం ఇచ్చిన చిన్న పెంకుటిల్లు తప్ప గుంట భూమిలేని నిరుపేద కుటుంబం.

a family waiting for financial help in manchirial district they are suffering with health issues
దయనీయం: ఆసరా కోసం కుటుంబం ఎదురుచూపు

By

Published : Jan 11, 2021, 12:30 PM IST

తెలంగాణ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన ఉపారపు పెద్దులు, రాజవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు నరేశ్‌ రెండు కాళ్లు పని చేయకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు. మూడో కొడుకు నవీన్‌ వయసు 13 సంవత్సరాలు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేశాడు.

ఏళ్లుగా పెండింగ్​లోనే...

రాజవ్వకు నాలుగేళ్ల నుంచి కాళ్లు పనిచేయట్లేదు. కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు ఒక కిలోమీటరు దూరం గెంతుతూ వెళ్లి రేండ్లగూడ ప్రధాన రహదారి పక్కన మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతుంది. కూలి పనులు చేసే కుటుంబ యజమాని పెద్దులు... పక్షవాతం బారిన పడ్డాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు రూ.200 పింఛను వచ్చేది. ఆ తర్వాత నిలిచిపోయింది. ఏడాదిన్నర కిందట పింఛన్‌ కోసం దరఖాస్తు చేశారు. జిల్లా పాలనాధికారి వద్దకు సైతం వెళ్లారు. అయిన ఫలితం లేకుండా పోయింది. ఎంపీడీవో కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉంది.

ఉన్న ఒక్కగానొక్క దిక్కు

వీరి కుమారుడు నరేశ్‌ రెండు కాళ్లు పని చేయకుండా పోవడం వల్ల చేతి కర్రసాయంతో కొంచెం దూరం మాత్రమే నడవగలుగుతున్నాడు. పెద్ద కుమారుడు సూర్యం మంచిర్యాలలో ఆటో నడుపుతూ భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు తనవంతుగా తోచిన సాయం అందిస్తున్నాడు.

ఇదీ చూడండి:

పాత్రికేయ భీష్ముడు పద్మశ్రీ తుర్లపాటి.. ఇక లేరు!

ABOUT THE AUTHOR

...view details