అమ్మఒడి వర్తించాలంటే విద్యార్థులకు కనీసం 75శాతం హాజరు ఉండాలనే నిబంధన అమలు వల్ల.. 51 వేల మంది తల్లులు 2021-22 విద్యాసంవత్సరానికి లబ్ధి కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండా పిల్లల్ని క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారికి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. డ్రాపవుట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కనీస హాజరు నిబంధన పెట్టామని వివరించింది.
2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన ఉత్తర్వులోనే ఈ నిబంధన ఉందని తెలిపింది. అయితే తొలి ఏడాది కావటంతో 2019-20లో, కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడినందున 2020-21లో కనీస హాజరు నిబంధనను సడలించామని చెప్పింది. ఈ పథకం కింద పిల్లల్ని బడికి పంపించే ఒక్కో తల్లికి అందించే రూ.15,000 ఆర్థిక సాయం నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.2 వేలు జమ చేస్తున్నట్లు వివరించింది.