Vijayawada Book Festival: విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం జనవరి 1 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. స్వరాజ్య మైదానం లేదా చుట్టుగుంట శాతవాహన కళాశాలలో నిర్వహించనున్నట్లు విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ప్రకటించింది. మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నామని.. ఎమెస్కో అధినేత, మహోత్సవం కన్వీనర్ విజయకుమార్, విజయవాడ పుస్తక సంఘం అధ్యక్షుడు మనోహరనాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య స్పష్టం చేశారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రావి శాస్త్రీ, బాల గంగాధరతిలక్, ఆత్రేయ, వడ్డాది పాపయ్య శతజయంతి సభలతోపాటు నవోదయ రామ్మోహనరావు, కాళీపట్నం రామారావు సంస్మరణ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
పుస్తక ప్రదర్శన సందర్భంగా ప్రతిరోజూ వివిధ సామాజిక అంశాలపై మేథో చర్చలు, కవి సమ్మేళనం, గోష్టులు, పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం వివిధ రంగాలకు చెందిన జాతీయ ప్రముఖ ప్రసంగాలతోపాటు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన ప్రతిభావేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.