తమిళనాడుకు చెందిన వీఎస్ఎల్ ఇండస్ట్రీస్ పర్యావరణానికి మేలు చేసే విధంగా రూపొందించిన 32 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది. ఈ వాహనాలను మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని జెండా ఊపి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే 15 వాహనాలు, కరోనా వైరస్ నియంత్రణకు డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే చేసే 4 వాహనాలు, డొమెస్టిక్ గూడ్స్‌ను సరఫరా చేసే 5 వాహనాలు, 4 మొబైల్ కొవిడ్ టెస్టింగ్ వాహనాలు, ప్రతి ఇంటికి ఆహారాన్ని అందించేందుకు వీలుగా తయారు చేసిన 4 వాహనాలను మంత్రులు ప్రారంభించారు.
పారిశుద్ధ్యం, కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు బ్యాటరీ వాహనాలు
పారిశుద్ధ్యం, కొవిడ్ నియంత్రణ అవసరాల కోసం పూర్తిగా బ్యాటరీతో నడిచే కోటి రూపాయల విలువైన వాహనాలను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని విజయవాడలో ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు, ప్రస్తుతం కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు ఉపయోగపడేలా ఈ వాహనాలు రూపొందాయి.
పంచాయతీరాజ్ శాఖకు 12, పట్టణాభివృద్ధి శాఖకు 12, వైద్య, ఆరోగ్యశాఖకు 4, సివిల్ సప్లయిస్ శాఖకు 4 వాహనాలను ఉచితంగా అందచేసిన చెన్నైకి చెందిన వీఎస్ఎల్ సంస్థ అధినేత హరికృష్ణను మంత్రులు అభినందించారు. సాధారణ వాహనాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం వుందని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. బ్యాటరీతో రీఛార్జ్ చేసుకునే వాహనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవడం వల్ల అటు ఇంధన భారం తగ్గడమే కాకుండా.. పర్యావరణానికి మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి;ఈ నెల 12న వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభం