గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-గుడా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-తుడా, అనంతపురం-హిందుపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని పెంచుతూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. సమీపంలోని మున్సిపాలిటీలు, మండలాలను వీటి పరిధిలోకి తెచ్చారు. కాకినాడ కేంద్రంగా ఉన్న గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కొత్తగా మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, యేలేశ్వరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలిపారు. ప్రస్తుతం ఉన్న పరిధికి అదనంగా 24 మండలాల్లోని 236 గ్రామాలు గుడా పరిధిలో విలీనం అయ్యాయి.
ప్రస్తుతం 2 వేల 183 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉన్న గుడా పరిధి నాలుగు పురపాలికల చేరికతో 4 వేల 396 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరింది. గతంలో నాలుగు పురపాలికలు, 26 మండలాల్లోని 280 గ్రామాల పరిధి కలిగిన గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి 2018లో తుని, రామచంద్రాపురం మున్సిపాలిటీల్లోని 7 మండలలాలు, 74 గ్రామాలను కలిపారు.
అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-అహుడా పరిధిలోకి.... రాప్తాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తీసుకువచ్చారు. రాప్తాడు, చెన్నెకొత్తపల్లి, కనగానపల్లి, ఆత్మకూరు, రామగిరి మండలాల్లోని 1570 చదరపు కిలోమీటర్ల ప్రాంత పరిధిని తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అహుడా పరిధిలోకి 6వేల 591 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వచ్చి చేరింది.