భక్తుల కొంగు బంగారంగా పేరొందిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో రెండో రోజైన ఇవాళ అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలము అందించే అలంకారంగా శ్రీబాలాదేవిని నమ్ముతారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపురసుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయని..నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రోజుకు పదివేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని వీక్షించే అవకాశాన్ని కల్పించారు.