ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP News: రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలి..కన్నా కుటుంబానికి కోర్టు ఆదేశం - kanna laxmi narayana latest updates

AP News: భారతీయ జనతా పార్టీ (భాజపా) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీ, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మీ కీర్తి వేసిన గృహహింస కేసులో రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ విజయవాడ ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తి టాటా వెంకట శివ సూర్య ప్రకాష్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

కన్నా కుటుంబానికి కోర్టు ఆదేశం
కన్నా కుటుంబానికి కోర్టు ఆదేశం

By

Published : Jan 20, 2022, 3:53 PM IST

AP News: భారతీయ జనతా పార్టీ (భాజపా) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీ, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మీ కీర్తి వేసిన గృహహింస కేసులో రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ విజయవాడ ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తి టాటా వెంకట శివ సూర్య ప్రకాష్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ నేపథ్యం...
కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు, శ్రీలక్ష్మీ కీర్తి 2006 మే 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2013లో కుమార్తె కౌషిక మానస జన్మించింది. 2006 నుంచి 2015 వరకు గుంటూరు కన్నావారితోట వద్ద అత్తమామలతో కలసి ఉన్నామని, సంసారం సవ్యంగా సాగిందని బాధితురాలు పేర్కొన్నారు. ‘మా వివాహం జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మీ సూటిపోటి మాటలతో విసిగించేవారు. మా తల్లిదండ్రులు చూడడానికి వచ్చినా ఇంటిలోకి రానివ్వలేదు. వేరొకరిని చేసుకుని ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు సమకూరేవని వేధించే వారు. భర్త నాగరాజు వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను వేధించేవారు. ఆ విషయం అడిగినందుకు 2015 మార్చి 29న నన్ను కొట్టారు. అప్పటి నుంచి దూరం పెట్టారని బాధితురాలైన శ్రీలక్ష్మీకీర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని, నివాస వసతి కల్పించాలని, వైద్య ఖర్చులను ఇప్పించాలని గృహహింస చట్టం ప్రకారం న్యాయస్థానంలో కన్నా నాగరాజు, కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీలను ప్రతివాదులుగా చూపిస్తూ ఆమె కేసు దాఖలు చేశారు.

మూడు నెలలలోపు ఇవ్వాలి
దీనిపై... పిటిషనర్‌ అయిన శ్రీలక్ష్మీ కీర్తికి ప్రతివాదులైన కన్నా నాగరాజు, లక్ష్మీనారాయణ, విజయలక్ష్మీల నుంచి రక్షణ కల్పిస్తామని, ఆమె నివసించే పోలీస్‌స్టేషన్‌లో ఈ ఆర్డర్‌ కాపీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్‌కు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ వసతి కోసం నెలకు రూ.50వేలు చెల్లించాలని, కుమార్తె వైద్యం కోసం చేసిన ఖర్చుల నిమిత్తం రూ.50వేలు చెల్లించాలని, ముగ్గురు ప్రతివాదులు ఆమెకు నష్టపరిహారం కింద రూ.కోటి ఇవ్వాలని ఆదేశించారు. ఇవన్నీ మూడు నెలలలోపు ఇవ్వాలని, లేని పక్షంలో 12 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details