పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో రాష్ట్రం దక్కించుకున్న 17 అవార్డులను జిల్లాలు, మండలాలు, పంచాయతీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రదానం చేశారు. ఈ-పంచాయతీ విభాగంలో రాష్ట్రస్థాయిలో సాధించిన అవార్డును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కమిషనర్ గిరిజాశంకర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలో సాధించిన అవార్డులను కూడా అధికారులకు ఆయన ప్రదానం చేశారు.
*జిల్లా స్థాయిలో గుంటూరు సాధించిన అవార్డును జిల్లా పరిషత్ సీఈవో డి.చైతన్య, కృష్ణా జిల్లా అవార్డును జడ్పీ సీఈవో పీఎస్ ప్రకాశరావుకు సీఎం అందజేశారు. మండల స్థాయిలో సాధించిన అవార్డులను చిత్తూరు జిల్లా సదుం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం, కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణం, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవోలకు ప్రదానం చేశారు. పంచాయతీ స్థాయిలో కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖ జిల్లా పెదలబుడు, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పు గోదావరి జిల్లా జి.రంగంపేట పంచాయతీలకు ముఖ్యమంత్రి అవార్డులను అందజేశారు. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డుకు రూ.25 వేలు, పంచాయతీ స్థాయి అవార్డులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ అందిస్తుందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.
పనితీరుకు నిదర్శనమే అవార్డులు: మంత్రి పెద్దిరెడ్డి
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 17 అవార్డులు రాష్ట్రంలో విప్లవాత్మకంగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘జాతిపిత మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థ పంచాయతీలను ఎంతో బలోపేతం చేస్తోంది. వాటి ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆయన ప్రయత్నాన్ని ప్రోత్సహించేలా ఈ రోజు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 17 అవార్డులు లభించాయి’’ అని వ్యాఖ్యానించారు.
కొవిడ్ నివారణలో స్ఫూర్తి చాటాలి: ప్రధాని