తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కృష్ణా జిల్లా మచిలీపట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం 13రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న రాత్రి 7.45గంటలకు పోలీసులు ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం సబ్‌జైలుకు తీసుకువచ్చారు. తొలుత విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు 153(ఎ), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్లకు కింద కేసు నమోదు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పట్టాభి బెయిల్ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాదులు ఇవాళ దాఖలు చేయనున్నారు. పట్టాభిని ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కొవిడ్ పరీక్ష అనంతరం పోలీసు బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం తరలించారు.
ఖాళీలతో 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు
కోర్టులో వాదనల సందర్భంగా పట్టాభి పలు అంశాలను ప్రస్తావించారు. పోలీసులు తనపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వలేదని చెప్పారు. మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేసినట్లు చెబుతున్న నేర అంగీకార పత్రంలో లోపాలను ఎత్తిచూపారు. తాను నేరాన్ని అంగీకరించలేదని, సంతకాలే తీసుకున్నారని చెప్పారు. 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసులో ఖాళీలు ఎందుకు ఉన్నాయని, దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని గవర్నర్‌పేట సీఐని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలు
ఈ నెల 19న తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులపై పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించారు. ఇది వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమైంది. వివిధవర్గాల మధ్య వైషమ్యాలకు దారితీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. అతడు వాడిన రెచ్చగొట్టే భాష కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారి పట్ల ఇటువంటి ధోరణి సరికాదు. ఆయనను అరెస్టు చేయకుండా వదిలేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. ముఖ్యమంత్రిని దూషిస్తూ.. జన్మనిచ్చిన ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టాభిపై కేసు నమోదు అయింది.
ఈ కేసు విచారణ నిమిత్తం పట్టాభి ఇంటికి వెళ్లగా.. విచారణకు సహకరించకుండా ఇంట్లో ఉండి తలుపులు వేసుకున్నారు. నాలుగున్నర గంటల పాటు వేచి చూసినా బయటకు రాలేదు. దీంతో ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నాం. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో నగరానికి దూరంగా ఉన్న తోట్లవల్లూరు స్టేషనుకు తరలించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. ఇప్పటికే పట్టాభిపై నగర కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. ఒకటో పట్టణ పీఎస్‌లో క్రైం నెం.. 6/21, గవర్నర్‌పేట స్టేషనులో క్రైం నెం. 86/19, 87/19, సూర్యారావుపేట స్టేషనులో క్రైం నెం. 224/20, కృష్ణలంక స్టేషనులో క్రైం నెం. 32/21 కింద నమోదై, వివిధ దశలలో ఉన్నాయి.
పట్టాభితో పాటు మరికొందరు ఉన్నట్లు అనుమానం ఉంది. వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు విచారించాలి. నిందితుడి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో పలు అవాంఛనీయ ఘటనలు సంభవించాయి. ఓ పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషనులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేయాల్సి వచ్చింది.
సంబంధిత కథనాలు
PATTABHI RAM : భారీ భద్రత నడుమ.. విజయవాడకు పట్టాభి తరలింపు
TDP: పట్టాభి అరెస్టుపై తెదేపా నేతల అగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని డిమాండ్
Pattabhi: తెదేపా నేత పట్టాభి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు