వాహనచోదకులు నిబంధనలు పాటించకపోతే ఇకపై భారీగా జరిమానాలు కట్టడానికి సిద్ధమవ్వాల్సిందే. మోటారు వాహన చట్టంలోని 37 సెక్షన్ల కింద ఉల్లంఘనలకు అపరాధ రుసుములు భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇవి బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మోటారు వాహన సవరణ చట్టం-2019 కింద ఈ జరిమానాలు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. శిరస్త్రాణం (హెల్మెట్) లేకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే ఇప్పటి వరకు రూ.100 అపరాధ రుసుము విధిస్తుండగా ఇకపై రూ.వెయ్యి కట్టాలి. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వారికి శిరస్త్రాణం లేకపోయినా రూ.వెయ్యి అపరాధరుసుము విధించనున్నారు. డ్రైవింగ్ అర్హత వయసులేని వారు (18 ఏళ్లలోపు వారు) వాహనాలు నడిపితే రూ.5 వేలు జరిమానా కట్టాలి. ఇది గతంలో రూ.500 ఉండేది. అర్హత లేనివారికి వాహనం ఇస్తే వాహన యజమానికి గతంలో రూ.వెయ్యి జరిమానా విధించేవారు.
* డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ వినియోగిస్తే తొలిసారి రూ.1,500, రెండోసారి రూ. 10,000
* మైనర్లు వాహనం నడిపితే: రూ. 5,000
* వాహనం డిజైన్ మారిస్తే: రూ. 1,00,000