ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పింగళి తయారు చేసిన జాతీయ పతాకం.. జాతికే గర్వకారణం

త్రివర్ణపతాకానికి పుట్టినిల్లు బెజవాడ. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య దీనిని రూపొందించి నేటికి సరిగ్గా వందేళ్లు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. జాతీయ జెండా శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆనాటి చరిత్రను నేటి తరానికి గుర్తూ చేస్తూ.. విజయవాడ వేదికగా పలు స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలు చేపట్టాయి.

National_Flag
National_Flag

By

Published : Mar 31, 2021, 6:28 PM IST

అది 1921 మార్చి 31వ తేదీ. విజయవాడలోని నేటి బాపూ మ్యూజియం.. నాడు విక్టోరియా జూబిలి మహల్. అందులోని సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు మాట్లాడారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే తన సహ అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో జెండా నమూనా తయారుచేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా రాట్నం చిహ్నం అందులో ఉంది. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ పలు సూచనలు చేశారు.

జెండాలో మార్పులు

ఇలా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జాతీయ పతాకం తయారు చేశారు. 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో సిక్కులు పతాకంలోని రంగుల గురించి సమస్య లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం అజాద్‌, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్‌, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ సూచనల ప్రకారం.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య జెండాలో మార్పులు చేశారు. ఈ మార్పును కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది.

పునాది పడింది విజయవాడలోనే..

జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలనే ఆలోచనతో.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకుని ధర్మచక్రం ఉండేలా నిర్ణయం తీసుకొని మార్పులుచేశారు. ఈ చారిత్రక ఘట్టాలకు పునాది పడింది విజయవాడలో కావటం... నాటి సందర్భాన్ని భవిష్యత్​ తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో పలు స్వచ్ఛంద సంస్థలు శత జయంతి కార్యక్రమం నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీలు, ఫోటో ప్రదర్శనలను బాపూ మ్యూజియం వద్ద నిర్వహించాయి.

జాతీయ పతాకం ప్రస్థానంలో మైలురాళ్లను పరిశీలిస్తే..

భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలనలోకి రావటానికి ముందు విజయనగర సామ్రాజ్యం మొదలుకుని మొఘలుల సామ్రాజ్యం వరకూ అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. ఆయా రాజ్యాలు, సంస్థానాలకు వేటి జాతీయ జెండా వాటికి ప్రత్యేకంగా ఉండేవి. మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్ మీద బ్రిటన్ పాలన సాగేది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ జెండానే ఎక్కువగా వినియోగించేవారు.

అప్పుడే ఆలోచన పడింది

1857 సిపాయిల తిరుగుబాటుతో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటన్ సామ్రాజ్యం నేరుగా భారతదేశాన్ని తన పరిపాలన కిందకు తీసుకువచ్చింది. అప్పుడే ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే భారతదేశానికి మొట్టమొదటిగా ఒక జాతీయ జెండా వచ్చింది. వాటి మీద బ్రిటిష్ సామ్రాజ్య జెండా 'యూనియన్ జాక్' తప్పనిసరిగా ఉండేది. 19వ శతాబ్దం చివరలో భారతదేశంలో స్వాతంత్య్ర కాంక్ష.. జాతీయోద్యమం ఊపందుకునే సమయంలోనే భారత జాతీయ జెండా ఆలోచనలు బలపడ్డాయి. ఆ మేరకు జెండా రూపకల్పనలు జరిగాయి.

బెర్లిన్​లో ప్రదర్శన

భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పతాకాన్ని.. 1906 ఆగస్టు 7న ఇప్పటి కోల్‌కతాలోని పార్సీ బగాన్ కూడలిలో ఆవిష్కరించినట్లు చెప్తారు. అది కూడా త్రివర్ణ పతాకమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు ఉండేవి. పైన ఎనిమిది కమలం పువ్వులు, మధ్యలో 'వందే మాతరం' నినాదం కింద సూర్య, చంద్రుల బొమ్మలు ఉండేవి. రెండో జాతీయ పతాకాన్ని.. 1907లో దేశబహిష్కరానికి గురైన మేడం కామా తదితర విప్లవకారులు పారిస్‌లో ఆవిష్కరించారు. ఇది కూడా దాదాపు మొదటి పతాకం లాగానే ఉండేది. కాకపోతే పై భాగంలో కమలానికి బదులు.. ఇందులో సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలను చేర్చారు. ఈ పతాకాన్ని బెర్లిన్‌లో జరిగిన సోషలిస్ట్ సదస్సులోనూ ప్రదర్శించారు.

బెజవాడలో సమావేశం

స్వాతంత్య్ర పోరాటం కీలక మలుపు తిరిగిన 1917లో మూడో జాతీయ పతాకం రూపొందింది. స్వపరిపాలన ఉద్యమం సందర్భంగా అనిబీసెంట్, లోకమాన్య తిలక్‌లు దీనిని ఆవిష్కరించారు. ఇందులో ఏడు ఎరుపు గీతలు, ఐదు ఆకుపచ్చ గీతలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా పరిచివుంటాయి. వాటిపైన సప్తరుషుల చిహ్నంగా ఏడు నక్షత్రాలు.. ఒక వైపు మూలన బ్రిటన్ జాతీయ పతాకం, రెండో మూలన సూర్య, చంద్రుల చిహ్నాలు ఉన్నాయి. స్వాతంత్య్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 1921లో బెజవాడలో సమావేశమైంది.

గాంధీజికి పతాకం చూపిన పింగళి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి ఆ సదస్సులో గాంధీజీకి చూపారు. దేశంలో రెండు ప్రధాన మతస్తులైన హిందువులు, ముస్లింలకు గుర్తుగా.. ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. అందులో చరఖాను చేర్చాల్సిందిగా లాలా హన్స్‌రాజ్ సూచించారు. గాంధీజీ ఈ జెండాలోని ఎరుపు, ఆకుపచ్చ రంగులకు తోడు.. మిగతా మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును చేర్చాలని సూచించారు. ఈ పతాకాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉపయోగించారు. జాతీయ పతాకం చరిత్రలో 1931 మరో మైలురాయి. త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా నిర్ణయిస్తూ కాంగ్రెస్ సదస్సులో తీర్మానం చేశారు. ఎరుపు రంగును కాషాయ రంగుగా మార్చారు. అందులోని చరఖాను తొలగించి.. నేతాజీ సుభాశ్‌చంద్రబోస్ బ్రిటిష్ వారి మీద పోరాడటానికి స్థాపించిన భారత జాతీయ సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో తన జాతీయ జెండాగా ప్రదర్శించింది. 1947లో తెలుపు రంగు మీద చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది.

కలత చెందిన పింగళి

1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించారు. 'ది గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌'గా పిలిచే దాదాబాయి నౌరోజి సభకు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి వెంకయ్య కలత చెందారు. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనసులో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యునిగా నియమించారు. అనంతరం జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించి 1916లో 'ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా' అనే ఆంగ్ల పుస్తకం రచించారు.

భవష్యత్ తరాలకు అందించాలని..

త్రివర్ణ పతాక వందేళ్ల చరిత్రను పురస్కరించుకుని గాంధీజీకి పింగళి వెంకయ్య జాతీయ పతాకం అందజేసిన ప్రాంగణంలో భవిష్యత్​ తరాలకు అవగాహన కల్పించేలా ర్యాలీలు, ఫొటో ప్రదర్శనలను స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి. 'మా త్రివర్ణ పతాకం మా గౌరవం' నినాదంతో చారిత్రక ఘట్టాలను వివరిస్తూ విక్టోరియా హాల్​లో ఫొటో ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ అధ్వర్యంలో నిర్వహించారు. బాపు మ్యూజియం నుంచి తొలిసారి జాతీయ పతాకాన్ని ఏప్రిల్ ఒకటో తేదీన జింఖానా మైదానంలో ఎగరేసిన ప్రదేశం వరకూ వీరి ర్యాలీ సాగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని పింగళి వెంకయ్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నది అందరి ఆకాంక్ష.

ఇదీ చదవండి:జాతీయ జెండా రూపకల్పన ఆలోచన ఎలా మెుదలైంది..?

ABOUT THE AUTHOR

...view details