రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చిలో పూర్తవుతుండటంతో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెదేపా నేతలు పగటి కలలు కంటున్నారని ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా తెదేపాపై విమర్శలు చేశారు.
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తెదేపా అభ్యర్థిని ప్రకటించటాన్ని తప్పుపట్టారు. గతంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరణిస్తే అక్కడ వైకాపా పోటీ చేయలేదన్న రోజా.... తెదేపా మాత్రం హడావుడిగా అభ్యర్థిని ప్రకటించిందని విమర్శించారు. మరోవైపు తిరుమలలో వేయి కాళ్ల మండపం నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నాయని... దీనికి సంబంధించిన ఆకృతులన్నీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గర సిద్ధంగా ఉన్నాయన్నారు.