తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం
15:15 May 02
తిరుపతి బై పోల్లో అధికార వైకాపా సత్తా చాటింది. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి 6,26,108 ఓట్లు సాధించారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా తరపున బరిలో ఉన్న పనబాక లక్ష్మీకి 3,54,516 ఓట్లు పోలయ్యాయి. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా-జనసేన కేవలం 57,080 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. హస్తం పార్టీ అభ్యర్థికి 9,585 ఓట్లు వచ్చాయి.
తిరుపతి ఉపపోరులోనూ వైకాపా హవా కొనసాగింది. ఆ పార్టీ తరపున తొలిసారిగా పోటీ చేసిన డాక్టర్ గురుమూర్తి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యతను ప్రదర్శించారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా నుంచి బరిలో ఉన్న కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీపై 2,71,592 ఓట్లతో గెలుపొందారు. భాజపా-జనసేన పార్టీ అభ్యర్థి రత్నప్రభ కేవలం 57,080 ఓట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న చింతామోహన్కు.. ఆశించిన మేర ఓట్లు రాలేదు. 9,585 ఓట్లతో నాల్గో స్థానంలో నిలిచారు.
వైకాపా ఎంపీ బల్లి దుర్గప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చిత్తూరు, నెల్లూరు జిలాల్లో విస్తరించిన ఈ పార్లమెంట్ స్థానం(7 అసెంబ్లీ సెగ్మెంట్ల)లో 17,11,195 మంది ఓటర్లు ఉండగా... 55 శాతం పోలింగ్ నమోదైంది. వైకాపా తరఫున గురుమూర్తి, తెదేపా తరఫున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేశారు. భాజపా, జనసేన కూటమి నుంచి మాజీ సీఎస్ రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో కరోనా బాధితులకు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది.
ఇదీ చదవండీ... కర్నూలు: ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల్లో 9 మంది మృతి!