రాష్ట్రాన్ని దొంగ ఓట్లు - దొంగ నోట్ల రాజ్యంగా చేశారని తెదేపా నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. దొంగల పాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక దొంగ నోట్ల అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా? అని ప్రశ్నించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతికి ఎలా వచ్చాయని నిలదీశారు. వాళ్లంతా మంత్రులు పంపిన వైకాపా వాళ్లు కాదా? అని నిలదీశారు.
'కేసులు నమోదైన 12మంది అధికార వైకాపాకు చెందిన వారు కాదా..? దొంగ ఓట్ల ముద్రణపై కాలవ శ్రీనివాసులు చెప్పినప్పుడే ఎందుకు స్పందించలేదు? వాళ్లందరిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? వెనక్కి పంపామని డీజీపీ చెప్పిన 250 బస్సులు ఎవరివి? బస్సుల్లో వచ్చిన వాళ్లంతా ఎవరు? 144 సెక్షన్ విధిస్తే ఫంక్షన్ హాళ్లలో.. రోడ్లపై వేలమంది ఎలా చేరారు..?'- యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి