పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. అరుదైన జీవజాతులు.. ప్రకృతిసోయగాలలో ఉండే సౌందర్యమే వేరు. యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ఆధునిక మానవుడు...అందమైన ప్రకృతికి దూరమైపోతున్నాడు. కాలుష్యం కోరల్లో జీవించటమే కాక భూమి పై ఎన్నో జీవజాతుల వినాశనానికి కారణమవుతున్నాడు. ఈ సమస్యపై ఫోటోగ్రఫీతో పోరాటం చేస్తోంది తిరుపతికి చెందిన సుస్మితారెడ్డి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రతిభ చాటుతోంది. అంతరించిపోయే దశకు చేరుకున్న అనేక జంతువులు, పక్షులు, జీవులకు తన ఫోటోల రూపంలో జీవం పోస్తోంది.
బెంగళూరులో ప్రముఖ మార్కెటింగ్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్న సుస్మితకి.... చిన్నతనం నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే అందులో మెళకువలు నేర్చుకుంది. తల్లిదండ్రుల కోరిక మేరకు తొలుత కెరీర్ పై దృష్టి సారించిన ఆమె.. ఉద్యోగంలో నిలదొక్కుకున్న తర్వాత అభిరుచిపై దృష్టి పెట్టింది. వారాంతాలు, సెలవు రోజుల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారి పోతుంది. కనుమరుగవుతున్న మూగజీవాలను ఫొటోల రూపంలో ప్రజలకు పరిచయం చేస్తోంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కుల్లోని రకరకాల పక్షుల్ని సుస్మిత కెమెరాలో బంధించింది. హిమాలయాల్లోని అరుదైన జంతువులు, ప్రాణులను ఫొటోలు తీసింది.
ప్రపంచ వ్యాప్తంగా మూగజీవాల సంఖ్యలో శరవేగంగా వస్తున్న మార్పులను సుస్మిత అధ్యయనం చేసింది. వేల జీవజాతులకు నిలయమైన ఆఫ్రికా ఖండాన్ని సందర్శించింది. జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలిచే కెన్యా, ఇథియోపియా, టాంజానియా దేశాల్లో పర్యటించింది. అంతరించే దశలో ఉన్న విభిన్న రకాల పులులు, సింహాలు, ఏనుగులను వందల సంఖ్యలో ఫోటోలు తీసింది. ఆఫ్రికన్ గడ్డిభూములు, దట్టమైన అరణ్యాల్లో నెలలు తరబడి ఉండి.. బాహ్యప్రపంచానికి పరిచయం లేని పలు వన్యప్రాణుల్ని తన కెమెరా ద్వారా చూపించింది.
జంతువుల జీవన విధానం, వాటి ఆహార సేకరణలో వస్తున్న మార్పులు, మారిపోతున్న అటవీ స్వరూపం తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసింది... సుస్మిత. ఆ వివరాలు, విశేషాలు సామాజిక మాధ్యమాల ద్వారా మరింత మందికి చేరువ చేస్తోంది. సొంతంగా సుస్మితా రెడ్డి అనే వెబ్ సైట్ ప్రారంభించిన ఆమె... వైల్డ్ లైఫ్, నేచర్, కల్చర్ అంటూ విభిన్న విభాగాల ఫోటోలను నెటిజన్లకు అందుబాటులో ఉంచుతోంది.