కొవిడ్ పరిస్థితులను సమీక్షించుకుంటూ భక్తులకు జారీ చేసే దర్శన టికెట్ల కోటాను పెంచుతామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 5వేల మందికి ఆన్‌లైన్ ద్వారా టికెట్లను మంజూరు చేశామని, పరిస్థితులకు అనుగుణంగా మరో 5వేలు పెంచుతామని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌తో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి ఎల్1, ఎల్2 దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు త్వరగా స్వామి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. కొవిడ్ కారణంగా కొన్ని నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటన్నింటినీ రానున్న ఏడాది కాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దళితులు ఉండే ప్రాంతాల్లో 500 ఆలయాలు నిర్మించాలని అనుకున్నా చేయలేకపోయినట్లు చెప్పారు. ఆలయాల నిర్మాణానికి ఎక్కడ వినతులు వచ్చాయో అక్కడ వాటిని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఆయన మాటల్లోనే..
‘ప్రకృతి వ్యవసాయ’ పంటలతో నైవేద్యం
ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో స్వామి వారికి తయారు చేస్తున్న నైవేద్యం కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో ధర్మప్రచార పరిషత్ ద్వారా రైతులను సంసిద్ధం చేసి వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఇందుకు అన్ని జిల్లాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం.
- వారణాసి, ముంబయిలోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినా భూసేకరణ పూర్తి కాలేదు.
-తితిదేలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఇప్పటికే కమిటీని నియమించాం. అన్ని విభాగాల్లోని వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు శాశ్వత చర్యలు చేపట్టనున్నాం. ఇందుకోసం తితిదేలోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.
- తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.