తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి ఎం.గురుమూర్తి జయకేతనం ఎగరవేశారు. అందరూ ఊహించినట్లుగానే లెక్కింపు ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని కనబరిచారు. సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిపై భారీ ఆధిక్యంతో గెలిచారు. మూడో స్థానంలో భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు పది వేల లోపే ఓట్లు వచ్చాయి.నోటాకు 15,568 ఓట్లు పోలయ్యాయి. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నెల్లూరు, తిరుపతిల్లో ఆదివారం జరిగింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు శాసనసభ స్థానాల ఓట్లను తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి శాసనసభ స్థానాల ఓట్లను నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించారు. ఉదయం ఎనిమిదింటికి మొదలైన లెక్కింపు సాయంత్రం ఆరింటికి ముగిసింది.
పోస్టల్ బ్యాలెట్ నుంచీ వైకాపా ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్‌తో మొదలుపెట్టి చివరి వరకు ప్రతి రౌండ్‌లోను వైకాపా అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్‌లో మొత్తం 3,313 ఓట్లు పోలవ్వగా.. వైకాపా అభ్యర్థికి 1,533, తెదేపా 724, భాజపా 238, కాంగ్రెస్ అభ్యర్థికి 24 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపును నెల్లూరు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు పర్యవేక్షించారు.
ఓట్ల లెక్కింపు పరిశీలించిన అభ్యర్థులు
ఓట్ల లెక్కింపును పరిశీలించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తిరుపతిలోని లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చారు. లెక్కింపు మొదలైన కాసేపటికే తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఉదయం తిరుపతిలో కౌంటింగ్‌ను పరిశీలించిన గురుమూర్తి, సాయంత్రానికి నెల్లూరులోని లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. భాజపా అభ్యర్థి రత్నప్రభ ఉదయం తిరుపతి లెక్కింపు కేంద్రానికి వెళ్లి.. మధ్యాహ్నం 12 గంటలకల్లా నెల్లూరుకు చేరుకున్నారు. పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య ఉదయంనుంచి సాయంత్రం వరకు నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దే ఉన్నారు.
వైకాపాకు 2019 ఎన్నికలకంటే ఆధిక్యం
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావుకు 2,28,376 ఓట్ల మెజారిటీ రాగా, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి అంతకంటే ఎక్కువ లభించింది. 2019 ఎన్నికల్లోనూ తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున పనబాక లక్ష్మియే పోటీ చేశారు. అనారోగ్యంతో దుర్గాప్రసాదరావు మరణించడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించారు.