న్యూ దిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. తితిదే అనుబంధ ఆలయమైన శ్రీవారి ఆలయంలో మే 23 నుంచి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉత్సవాలకు మే 22న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. కొవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా… ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
అంతకు ముందు మే 18వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 23వ తేదీ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు వృషభ లగ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలను ప్రారంబిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీన సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పుష్పయాగం నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.