TTD: అన్నమయ్య భవన్లో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం వీఐపీ, శ్రీవారి దర్శనాలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతుండగా ఆ సమయాన్ని మార్పు చేయడం ద్వారా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శన సమయ నిర్దేశిత టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు కరోనా ముందు ఇచ్చిన తరహలోనే తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. సమయ నిర్దేశిత టోకెన్లు ఉన్నవారితో పాటు నేరుగా వచ్చే వారిని సర్వదర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపు వ్యవస్థలో మార్పును తీసుకరావడానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
భక్తులకు అందించే శ్రీవారి నైవేద్యాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను వినియోగించాలని తీర్మానించామని వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్క్ ఫెడ్, రైతు సాధికార సంస్ధ ద్వారా కొనుగోలు చేయనున్నామన్నారు. తిరుమలలో భక్తులకు మరింత వసతి సౌకర్యం కల్పించడానికి రూ.95 కోట్లతో 5వ భక్తుల వసతి సముదాయం (పీఏసీ - 5) నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి, హస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు కేటాయించామని తెలిపారు. వకుళామాత ఆలయ సమీపంలోని జాతీయ రహదారి నుంచి జూపార్క్ రోడ్డును అనుసంధానం చేయడానికి రూ.30 కోట్లు కేటాయించామన్నారు.