ముక్కోటి ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సాధారణ రద్దీతో ఉన్న సప్తగిరులు ఆదివారం మధ్యాహ్నం తర్వాత పోటెత్తాయి. నారాయణగిరి ఉద్యానవనంలో సుమారు 30వేల మంది సేదదీరేలా 17 షెడ్లను నిర్మించారు. ఆలయ మాడవీధుల వెంట సుమారు 24 వేల మంది విశ్రాంతి తీసుకునేలా షెడ్లు వేశారు. గ్యాలరీల్లో మరో 40వేల మంది వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. కల్యాణవేదికలోనూ సుమారు 4వేల మందికి వసతి కల్పిస్తున్నారు. దాదాపు 90 వేల మందితో అన్ని వసతి కేంద్రాలు నిండిపోవడం వల్ల ఆదివారం మధ్యాహ్నం రెండింటి నుంచి క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వైకుంఠం క్యూకాంప్లెక్సు నుంచి ద్వాదశి దర్శనానికి అనుమతిస్తారు. షెడ్లలో సేదదీరే సుమారు 60వేల మంది చలికి ఇబ్బంది పడకుండా తితిదే దుప్పట్లు ఇచ్చింది. మొబైల్ టాయిలెట్లు, ఇతర వసతులను సమకూర్చింది. మరోపక్క తితిదే చేపట్టిన విద్యుద్దీపాలంకరణ, దేవతామూర్తుల ప్రతిమలు, దేశవిదేశీ ఫలపుష్పాలతో అలంకరించిన మండపాలతో ఆలయం తళుకులీనుతోంది.
అర్ధరాత్రి నుంచి దర్శనం
భక్తులందరికీ వైకుంఠద్వార దర్శనం కల్పించే లక్ష్యంతో ఆదివారం రాత్రి పవళింపు సేవను రోజుకంటే గంట ముందే తితిదే ముగించింది. ఇవాళ తెల్లవారుజామున 1.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ధనుర్మాస కైంకర్యాలు పూర్తి చేసి రెండింటికి వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభించింది. వారితోపాటు శ్రీవాణి ట్రస్టు ద్వారా నమోదు చేసుకున్న వారికి మహాలఘు దర్శనం కల్పించింది. ఉదయం ఐదు గంటలనుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామి ఇవాళ ఉదయం 9 నుంచి 11గంటల వరకు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు. ఉత్తరద్వార దర్శనం కోసం ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరిలో రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.