కలియుగ వైకుంఠనాథుడు... తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపు తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న తితిదే... క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. ఈ నెల 11వ తేదీన పరిమిత సంఖ్యలో సాధారణ భక్తులను దర్శనాలకు అనుమతించిన ప్రభుత్వం... వారి సంఖ్యను పెంచింది. తొలి వారంలో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా రోజుకు మూడు వేల మందికి స్వామి దర్శనానికి తితిదే అనుమతించింది. తర్వాత సంఖ్యను పెంచింది. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్‌లో జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను ఆరు వేలకు పెంచింది.
ఈ నెల 30 వరకూ టికెట్లు...
శుక్రవారం నుంచి మరో మూడు వేలు అదనంగా జారీచేయడంతో ఆన్‌లైన్ టికెట్ల సంఖ్య తొమ్మిది వేలకు చేరింది. మరో వైపు నేరుగా తిరుపతి వచ్చిన వారి కోసం 3750 సర్వదర్శన టికెట్లు జారీ చేసింది. సర్వ దర్శన టోకెన్ల కోసం స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో పదకొండో తేదీ నుంచి మూడు రోజుల పాటు టికెట్లు(ఈ నెల 26 వరకు) ఇచ్చింది. తిరిగి రెండో విడత ఈ నెల 30 వరకు దర్శనం చేసుకొనేందుకు వీలుగా సర్వ దర్శన టోకెన్లను ఇవాళ్టి నుంచి జారీ చేస్తోంది. సర్వదర్శన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభమవడంతో భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలోకి చేరుకొని సర్వదర్శన టోకెన్లు తీసుకుంటున్నారు.