తిరుమలను కాలుష్యరహితంగా మారుస్తామని తితిదే స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ జవహర్ రెడ్డి అన్నారు. తొలివిడతలో అద్దెకు 35 ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో స్పెసిఫైడ్ అథారిటీ భేటీ అయ్యింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా తితిదే పరిధిలోని 10 ఆలయాల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని జవహర్ రెడ్డి అన్నారు. ఇందుకోసం రూ.9 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.2 కోట్ల వ్యయంతో తిరుమలలో మరిన్ని సీసీటీవీ కెమెరాలు, రూ. 4.27 కోట్లతో 22 స్కానర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
శ్రీవారి నైవేధ్యానికి ప్రకృతి సిద్ధమైన నెయ్యి వినియోగించనున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు. నెయ్యిని సమాకూర్చుకునేoదుకు 25 గిర్ జాతి గోవులను తీసుకువస్తున్నామన్నారు. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు ‘నవనీత సేవ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.