ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుపతిలో పూర్తిస్థాయి మద్యనిషేధం అమలు చేయండి' - తిరుపతిలో పూర్తిస్థాయి మద్యనిషేధం

చిత్తూరు జిల్లా తిరుపతిలో పూర్తిస్థాయి మద్యనిషేధాన్ని అమలు చేయాలని... తితిదే ధర్మకర్తల మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తిరుపతి పరిసరాల్లోని 10 కిలోమీటర్ల పరిధి వరకు ఈ నిబంధన విధించాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

వై.వి.సుబ్బారెడ్డి

By

Published : Oct 24, 2019, 9:48 AM IST

వై.వి.సుబ్బారెడ్డి

ఆధ్యాత్మికనగరం తిరుపతిలో పూర్తిస్థాయి మద్యనిషేధాన్ని అమలు చేయాలని... రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇతర సభ్యులతో కలిసి ఛైర్మన్‌ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నందున... ముందుగా తిరుపతి నగరంలో అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ... బోర్డు తీర్మానించింది. తిరుపతి పరిసరాల్లోని 10 కిలోమీటర్ల పరిధి వరకు ఈ నిబంధన విధించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇటీవల చేపట్టిన గరుడ వారధి ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆకృతుల మార్పులతో పాటు... రీటెండరింగ్‌ నిర్వహించాలని తీర్మానించినట్లు వివరించారు. ఇవే కాకుండా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు..

1.తిరుపతిలోని స్విమ్స్‌ను తితిదే పరిధిలోకి తీసుకునేందుకు ఆమోదం.

2.తిరుపతిలో 200 ఎకరాల విస్తీర్ణంలో ‘శ్రీవారి భక్తిధామం’ పేరుతో ఆధ్యాత్మిక నగరం నిర్మించేందుకు భూసేకరణ చేయాలని నిర్ణయం.

3.ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ తిరుమలలో నిషేధం. సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్‌ బాటిళ్ల వాడకాన్ని రద్దు చేయడం.

4.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తిరుమలలో వంశపారంపర్య అర్చకుల సేవలను వినియోగించుకోవడం.

5.గత ప్రభుత్వంలో తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించారనే కారణంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై వేసిన పరువునష్టం దావా కేసును ఉపసంహరించుకోవడం.

6. తిరుపతిలోని శ్వేత భవనంలో నిర్వహిస్తున్న అర్చక శిక్షణకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాల అభ్యర్థులకు శిక్షణ కాలంలో రోజుకు రూ.200 భృతి చెల్లింపు.

7.తిరుమలలో నగర సంకీర్తన, అఖండ హరినామ సంకీర్తనకు వచ్చే భజన కళాకారులకు రోజుకు రూ.200 భృతి. బస్సుఛార్జీలుగా కిలోమీటరుకు రూ.62 పైసలు చొప్పున చెల్లింపు.

8. ఏటా జానపద కళాకారుల బృందాల గురువులకు హెచ్‌డీపీపీ తరఫున సన్మానం.

ఇదీ చదవండీ... బెజవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు

ABOUT THE AUTHOR

...view details