ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala : అప్పటి నుంచి తిరుమలలో అన్నిరకాల సేవలు పునరుద్ధరణ - తిరుమల తాజా సమాచారం

ఏప్రిల్‌ 1 నుంచి కలియుగ వైకుంఠం తిరుమలలో ఆన్నిరకాల దర్శనాలు, ఆర్జితసేవలు పునరుద్ధరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అనుక్షణం గోవింద నామస్మరణతో, అనునిత్యం లక్షలాది భక్తులతో విరాజిల్లే తిరుమలలో...కరోనా ప్రభావం వల్ల 2020 మార్చి నుంచి అన్ని సేవలు నిలిచిపోయాయి. ఆ తరువాత సైతం భక్తుల్ని పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అన్ని సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

tirumala
tirumala

By

Published : Mar 31, 2022, 5:45 AM IST

Updated : Mar 31, 2022, 6:30 AM IST

ఏప్రిల్‌ 1 నుంచి తిరుమలలో అన్నిరకాల సేవలు పునరుద్ధరణ

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యోత్సవం, వారోత్సవం, మాసోత్సవం, పక్షోత్సవం అంటూ రకరకాల కార్యక్రమాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉంటుంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి భక్తులు తిరుమలేశుని ఆర్జిత సేవలకు దూరమయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు 4 నెలలు దర్శనాలన్నింటినీ పూర్తిగా రద్దు చేశారు. ఆ తరువాత కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో దర్శనానికి భక్తులు అనుమతిస్తూ వచ్చారు. రెండేళ్లుగా శ్రీనివాసుడి ఆర్జిత సేవల్ని తితిదే ఏకాంతంగానే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో ఏప్రిల్‌ 1నుంచి ఆర్జిత సేవలు సహా అన్ని రకాల దర్శనాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తితిదే తెలిపింది.

శ్రీవారి అర్జిత సేవలకు ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు తితిదే టికెట్లు కేటాయించింది. నిత్య సేవలైన సుప్రభాతం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటూ వారపు సేవలైన విశేషపూజ, అష్టదళ పాద పద్మారాదన, తిరుప్పావడసేవ, సహస్త్రకలశాభిషేకం, అభిషేకం, వస్రాలంకార సేవ, అర్చన, తోమాల సేవలకు భక్తులను అనుమతించనుంది. సిఫార్సు లేఖలపై కరెంటుబుకింగ్‌ ద్వారా కూడా సేవా టిక్కెట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరి సాధారణ భక్తుల కోసం ఆర్జిత సేవలను లక్కీడిప్‌ అమలు చేయనున్నారు.

టిక్కెట్ల సంఖ్యను పెంచిన తితిదే... రద్దీకి తగిన వసతులను కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో దర్శన టిక్కెట్లు తీసుకుని, దర్శనం కోసం మూడు రోజులు వేచిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గదులు, భోజన వసతులను మెరుగుపర్చాలని భక్తులు కోరుతున్నారు. ఆర్జితసేవ, సాధారణ దర్శన టోకెన్లు కలిగిన యాత్రికులు..కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పత్రాలతో తిరుమల రావాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ... ఆ ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:తితిదే కీలక నిర్ణయం...పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ దర్శనం

Last Updated : Mar 31, 2022, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details