భారీ వరదలకు తిరుపతిలోనే చిక్కుకుపోయిన భక్తులకు సత్రాల్లో వసతి కల్పించేందుకు తితిదే(ttd providing stay to devotees struck in tirupati) నిర్ణయించింది. వర్షం వల్ల తిరుమల వెళ్లలేని భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పిస్తోంది. ఈ మేరకు శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు బస ఏర్పాటు చేసింది. దీనికి తోడు వర్షాలతో తిరుమల రాలేని భక్తుల దర్శనానికి మరో అవకాశం ఇచ్చేందుకు అనుమతించింది. నేడు, రేపు, ఎల్లుండి దర్శన టికెట్లు ఉంటే.. వాటిని తర్వాత దర్శనానికి వినియోగించేందుకు వెసులుబాటు కల్పించింది. వర్షాలు తగ్గాక భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తితిదే స్పష్టం చేసింది.
జలమయమైన తిరుపతి.. అందుకే వసతి కల్పన
తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరమంతా ఎటుచూసినా వర్షపు నీరే దర్శనమిస్తోంది. ప్రధాన కూడళ్లలో భారీగా వరద నీరు నిలవడంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి వెళ్లే భక్తులు, స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. నగరంలోని ప్రధానమైన లక్ష్మీపురం కూడలిలో భారీగా నీరు నిలవడంతో..ఆ ప్రాంతం గుండా రాకపోకలు పూర్తిగా నిలిచాయి. దేవేంద్ర థియేటర్ కూడలి, కరకంబాడి రోడ్డు, తిరుచానూరు రోడ్డు జలమయమయ్యాయి. వెస్ట్ చర్చి, ఈస్ట్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్‌లు నీట మునగడంతో నగరంలో జనజీవనం స్తంభించింది. అనేక చోట్ల వాహనాల రాకపోకల్ని మళ్లించారు. ఎడతెరిపి లేని వానలతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కపిలతీర్థం, మాల్వాడి గుండం జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాలువల పరీవాహక ప్రాంతాలను ముంపునకు గురిచేశాయి. ప్రధాన రహదారులు నీటమునిగి రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.
ఇదీ చదవండి:
Rains: తిరుపతి జలమయం..తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు