చిత్తూరు జిల్లాకు పొరుగున ఉన్న తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు.... సరిహద్దుల్లోని తమిళనాడు గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ ప్రభావం చిత్తూరుపై తీవ్రంగా ఉంది. రెండు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా కరోనా విస్తరించింది. తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె, నగరి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యాయి. జిల్లాలో మరే ప్రాంతంలో లేని స్థాయిలో శ్రీకాళహస్తి పట్టణంలో దాదాపు రెండు వందల పైబడి కేసులు నమోదయ్యాయి. సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 1700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తితిదే వసతి గృహాల్లో చికిత్స
చిత్తూరు... జిల్లా ఆసుపత్రితో పాటు తిరుపతి రుయా, పద్మావతి మహిళా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రులుగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రులతో తితిదే వసతి గృహం, పద్మావతి నిలయాన్ని కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. వీటిలో 400 మందికి చికిత్స అందిస్తున్నారు.